ఓరీ దేవుడో.. ఈ కాఫీ తాగాలంటే రాసుండాలి.. బంగారం కంటే ఖరీదు..! రుచి చూస్తే మతి పోవాల్సిందేనట..
కాఫీ కేవలం ఒక డ్రింక్ మాత్రమే కాదు. ఇది చాలా మందికి శక్తినిచ్చేది. అభిరుచిలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కాఫీ ప్రియులు ఉన్నారు. కానీ, పనామా గీషా అనేది రాయల్టీ రుచిని కోరుకునే వారికి మాత్రమే ప్రత్యేకించబడింది. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కాఫీలలో ఒకటిగా చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది బంగారం కంటే కూడా ఖరీదైనది.

ప్రపంచంలో బంగారం లాంటి విలువైన కాఫీ ఉందని, అందరూ దానిని రుచి చూడలేరని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును.. పనామా గీషా కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన కాఫీ అని చెబుతారు. దీని ప్రత్యేక వాసన, రుచి, పరిమిత ఉత్పత్తి కాఫీ ప్రియులకు ఇది ఒక విలాసవంతమైన రత్నం కంటే తక్కువ కాదు. ఈ కాఫీను పశ్చిమ పనామాలో గల బారు పర్వతంలోని హసిండా లా ఎస్మెరాల్డా పొలంలో పండిస్తారు. దీని పండ్ల రుచి, పూల సువాసనలకు, అధిక నాణ్యతకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. ఈ కాఫీను జాగ్రత్తగా చేతితో సేకరించి పొలంలోనే ప్రాసెసింగ్ చేస్తారు. చల్లని వాతావరణం, ఎత్తైన పర్వతాల్లో, సహజ వాతావరణం బీన్స్‌కు ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అందుకే ఈ పొలంలో పండిన కాఫీ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ వేలంలో రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది.
రికార్డు స్థాయిలో వేలం ధర:
గీషా కాఫీ కేవలం రుచిలోనే కాదు, రైతుల కృషికి, సాగు నాణ్యతకు, ప్రపంచ ప్రత్యేక కాఫీ మార్కెట్‌కు చిహ్నం. 2025లో జరిగిన బెస్ట్ ఆఫ్ పనామా వేలంలో కేవలం 20 కిలోల బరువున్న హసీండా లా ఎస్మెరాల్డా నుండి వచ్చిన గీషా గింజల చిన్న లాట్ సుమారు $600,000 (రూ.5 కోట్లకు పైగా) కు అమ్ముడైంది. ఊహించుకోండి 1 కిలో కాఫీ గింజల ధర దాదాపు రూ.25 లక్షలు. ఇది కేవలం పానీయం కాదు, కాఫీ ప్రియులకు లగ్జరీ, రాయల్టీ అనుభవం.
కాఫీ ప్రత్యేకత ఏమిటి?:
ఈ కాఫీ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కాఫీ గింజలను చేతితో కోస్తారు. తరువాత వాటిని శుభ్రం చేస్తారు. దీనిని నెమ్మదిగా చల్లని వాతావరణంలో ఎండబెట్టి, ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలించి, దాని ప్రత్యేకమైన రుచి, సువాసనను కాపాడుతారు. పోర్-ఓవర్ పద్ధతిని (V60 లేదా కెమెక్స్ వంటివి) ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. నీటి ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉండకూడదు (92–94°C అనువైనది). ప్రతి సిప్‌లోని విభిన్న రుచులను ఆస్వాదించడానికి చిన్న కప్పులలో నెమ్మదిగా రుచి చూడాల్సి ఉంటుంది.
రుచి, వాసన ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటుంది?:
గీషా కాఫీ మరే ఇతర కాఫీ రుచిని కలిగి ఉండదు. ఇది మల్లె, మందార వంటి పూల సువాసనలను, సిట్రస్, బెర్గామోట్ వంటి రుచులను, పీచు, తేనె వంటి తీపిని కలిగి ఉంటుంది. చాలా సేపటి వరకు మీ నోటికి కమ్మటి రుచిని అలాగే ఉంచుతుంది. దీంతో మీకు కాఫీని అనుభూతి కంటే.. పువ్వులు, పండ్ల మిశ్రమాన్ని అనుభవిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








