Best Tourist Places: సెలవులు దగ్గరపడ్డాయ్.. ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేలా టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ దగ్గరలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్..
Best Tourist Places: పండగ పూర్తైంది. ఊర్లకు వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణం మొదలుపెడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా పూర్తి కావొచ్చాయి. ఇన్ని రోజులు ఎక్కడికీ వెళ్లకుండా హాలీడేస్ గడిపిన వారు కనీసం ఒక్కరోజైన బయటకు వెళితే బాగుండును అనుకుంటారు.. అలాంటి వారి బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ మన హైదరాబాద్‌కు అతిచేరువులో అనేకం ఉన్నాయి. మీరు ఉదయాన్నే వెళ్లి సాయంత్రం కల్లా తిరిగి వచ్చే పిక్నిక్ స్పాట్స్ ఇవి.. నగరానికి కొద్ది దూరంలోనే ఉన్నాయి. అక్కడి అందాలు, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్నీ కట్టిపడవేస్తుంది. ఆ వివరాలేంటో చూసేయండి.
Updated on: Oct 03, 2025 | 9:40 AM

అనంతగిరి కొండలు: ఇది హైదరాబాద్ నుండి సుమారు 79 కిలోమీటర్ల దురంలో ఉంది. పచ్చదనం మధ్య ఉన్న పర్వతం అనంతగిరి.ఇక్కడి జలపాతాలు మనకి మంచి ఆహ్లదాన్ని ఇస్తాయి. ఇక్కడ అనంత పద్మ నాభ స్వామి ఆలయం కూడా మనం దర్శించుకోవచ్చు.ట్రెక్కింగ్ ఇష్టం ఉన్నవాళ్ళకి మంచి ప్లేస్ గా చెప్పుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే..అందమైన అనంతగిరి కొండలు ఆధ్యాత్మికతకు నిలయమైన పద్మనాభ ఆలయం. ఆపై ఔషధ మొక్కలు వెరసి ఈ కొండలు వేలాది మంది పర్యాటకులను ఆకట్టుకోవడమే కాదు, మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తున్నాయి.

కొలనుపాక జైన్ మందిర్: ఈ దేవాలయం 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం. ఇది హైదరాబాద్ నుండి సుమారు 78 కిలోమీటర్ల దూరంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో మూడు విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కటి రిషభ, స్వామి నేమినాథ్, స్వామి మహావీరుడు. మహావీర్ విగ్రహాన్ని జెడ్ స్టోన్ తో నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడి వాతావరణం, శిల్పకళా ప్రశాంత కలిగిస్తాయి.

నాగార్జున సాగర్ డ్యామ్: నాగార్జున సాగర్ డ్యామ్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద డ్యామ్ గా ప్రసిద్ధి. ఇది హైదరాబాద్ నుండి సుమారు 150 కిలోమీటర్లు. ఇక్కడ నాగార్జున కొండ ,బోటింగ్, వాటర్ ఫాల్స్ మంచి అనుభూతిని ఇస్తాయి. యానిమల్ ఫారెస్ట్, పురాతన బౌద్ధ నిర్మాణాలు కనువిందు చేస్తాయి. ప్రపంచంలోని ఏకైక ఐలాండ్ మ్యూజియంగా ఉన్న నాగార్జునకొండ, అనుపు, ఎత్తిపోతల, ప్రధాన జలవిద్యుత్ కేంద్రాల్ని,... కుడి, ఎడమ కాలువలను, మోడల్ డ్యాంను చూసేందుకు రోజూ వందల మంది దేశ-విదేశీ పర్యాటకులు నాగార్జునసాగర్‌కు రావడంతో ఇది ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.

పోచారం వన్యప్రాణి అభయారణ్యం: ఇది హైదరాబాద్ నుండి సుమారు 115 కిలోమీటర్లు ఉంటుంది.అడవిలో ప్రయాణం చేస్తూ పక్షులను చూడడం ఒక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. వీటితోపాటు ఎలుగు బంట్లు,చిరుత,జింకలు కూడా వీక్షించవచ్చు. ఈ అభయారణ్యంలో ఏర్పాటు చేసిన వన విజ్ఞాన కేంద్రం సందర్శకులకు కొత్త అనుభూతులు కలిగించడమే కాకుండా వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ పలు జంతువులను దగ్గరగా చూడొచ్చు.

రాచకొండ కోట: ఇది హైద్రాబాద్ నుండి సుమారు 55 కిలోమీటర్లు ఉంటుంది. 14 శతాబ్దంలో ఈ కోటను రాళ్ల తో నిర్మించడం విశేషం. ఇక్కడి ప్రకృతి ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేవారికి బాగుటుంది. రాచకొండలో కట్టడాలు, నిర్మాణాలతో పాటు గుహలు, వందల సంఖ్యలో దేవాలయాలు, శిల్ప కళాఖండాలు, చిత్రాలు ఉన్నాయి. ప్రధానంగా కచేరి ప్రదర్శన శాల, ఉత్సవ విగ్రహాల మందిరం, సన్యాసుల దొన, సంకెళ్ల బావి, మెట్ల బావులు, కోనేర్లు, కోట చుట్టూ ఉన్న రాతి కట్టడాలు, కొండలు, గుహలు, గొలుసు కట్టు చెరువులు, దేవలమ్మ నాగారంలోని నాగాంబిక శిలాశాసనం, గన్నేర్లలోని జాలువారు సెలయేళ్లు, మొల్కచెర్వు ప్రాంతంలోని ఎత్తయిన జలపాతాలు, అంతకు మించి పచ్చటి కొండలు, చిట్టడవిలో నెమళ్లు కనువిందు చేస్తాయి.
