భారతీయులకు మాత్రమే ఎందుకు పె..ద్ద.. బొజ్జ ఉంటుందో తెలుసా?
ప్రపంచంలో ఏ దేశంలోనూ కనబడని భారీ పొట్ట ఉండే వ్యక్తులు ఒక్క భారత్‌లోనే కనిపిస్తారు. అందుకు కారణం మన జీవనశైలేనట. 40 ఏళ్లు దాటిన తర్వాత బరువు తగ్గడం ఎందుకు కష్టమవుతుందనే విషయంపై నిపుణులు కీలక వివరాలు వెల్లడించారు. జీవక్రియ మందగించడం, కండరాల బలహీనత, హార్మోన్ల మార్పులు, శారీరక శ్రమ తగ్గిపోవడం వంటి కారణాలు బరువు పెరుగుదలకు దారితీస్తున్నాయని చెబుతున్నారు..

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యంపై సరైన శ్రద్ధ తీసుకోకపోతే వయసు పెరిగే కొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత బరువు పెరగడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. యువ వయస్సులో సులభంగా తగ్గే బరువు.. నలభై దాటాక ఎందుకు తగ్గడం కష్టమవుతోంది? అనే విషయంపై ఆరోగ్య నిపుణులు కీలక విషయాలు వెల్లడిస్తున్నారు.
జీవక్రియ మందగించడం ప్రధాన కారణం
నిపుణుల ప్రకారం వయసు పెరిగేకొద్దీ శరీరంలోని జీవక్రియ (మెటాబాలిజం) వేగం తగ్గుతుంది. దీంతో శరీరం కేలరీలను మునుపటిలా వేగంగా దహనం చేయలేకపోతుంది. 20 లేదా 30 ఏళ్ల వయస్సులో తీసుకునే ఆహారాన్ని 40 ఏళ్ల తర్వాత కూడా అదే స్థాయిలో తీసుకుంటే అదనపు కేలరీలు కొవ్వుగా మారి శరీరంలో నిల్వ అవుతాయి.
కండరాల బలహీనత కూడా కారణమే
40 ఏళ్ల తర్వాత శరీరం క్రమంగా కండర ద్రవ్యరాశిని కోల్పోతుంది. దీనివల్ల శరీరం కేలరీలను ఖర్చు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా చేతులు, కాళ్లలో కండరాలు బలహీనపడటం వల్ల శారీరక శ్రమ తగ్గి కొవ్వు ఎక్కువగా పొట్ట భాగంలో పేరుకుపోతుంది. దీనినే సాధారణంగా ‘బెల్లీ ఫ్యాట్’ లేదా ‘పొట్ట పెరగడం’గా పిలుస్తారు.
హార్మోన్ల మార్పుల ప్రభావం
మహిళల్లో పెరిమెనోపాజ్, మెనోపాజ్ దశల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తగ్గడం వల్ల బరువు నియంత్రణ కష్టమవుతుంది. హార్మోన్లలో వచ్చే ఈ మార్పులు శరీరంలో కొవ్వు నిల్వలను పెంచే అవకాశముంది.
శారీరక శ్రమ తగ్గుదల
వయసు పెరిగేకొద్దీ చాలామంది వ్యాయామం, నడక వంటి శారీరక కార్యకలాపాలను తగ్గిస్తారు. జిమ్‌కు వెళ్లడం, రోజువారీ పనులు స్వయంగా చేయడం కూడా తగ్గిపోతుంది. దీంతో శరీరంలో కేలరీలు ఖర్చు కాకపోవడంతో బరువు వేగంగా పెరుగుతుంది.
నిపుణుల సూచనలు
40 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ కింది సూచనలు పాటించాలి..
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి
- ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి
- చక్కెర, జంక్ ఫుడ్ తగ్గించాలి
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
- సరిపడ నిద్ర, ఒత్తిడి నియంత్రణపై దృష్టి పెట్టాలి
జీవనశైలిలో ఈ చిన్న మార్పులు చేసుకుంటే 40 ఏళ్ల తర్వాత కూడా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




