Kidney Stones: కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? దీనిని నివారించవచ్చా? డాక్టర్ సలహా ఏమిటంటే
ప్రస్తుతం మనిషి జీవన శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది. తినడానికి, నిద్రపోవడానికి సరైన సమయం ఉండడం లేదు. అంతేకాదు తగ్గిన శారీరక శ్రమ.. ఇవన్నీ వివిధ రకాల వ్యాధులకు కారణం అవుతున్నాయి. ప్రస్తుతం కిడ్నీలో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారిందని డాకర్లు చెబుతున్నారు. ఎక్కువ మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే మనం మన దినచర్యతో పాటు తినే ఆహారంలో జాగ్రత్తగా తీసుకుంటే దీనిని నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాల్షియం, యూరిక్ యాసిడ్ లేదా ఆక్సలేట్ వంటి కొన్ని ఖనిజాలు శరీరంలో అధికంగా పేరుకుపోయి మూత్రం ద్వారా అవి బయటకు వేల్లలేనప్పుడు.. అవి క్రమంగా పేరుకు పోయి చిన్న చిన్న గట్టి గడ్డలుగా ఏర్పడతాయి. ఈ గడ్డలు రాళ్లుగా మారుతాయి.
మూత్రపిండంలో రాయి ఉంటే రోగి నడుము, కడుపు లేదా మూత్ర నాళంలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడతాడు. కొన్నిసార్లు వాంతులు, వికారం లేదా మూత్ర విసర్జన సమయంలో మంట వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. కొన్నిసార్లు మూత్రపిండంలో రాయి ఉంటే రోగి భరించలేని నొప్పితో ఇబ్బంది పడతాడు. ఈ నొప్పి తరచుగా రాత్రి సమయంలో వస్తుంది. దీంతో రోగికి తినాలనే కోరిక కూడా తగ్గుతుంది, మూత్రపిండాల్లో రాళ్లు ఎలా, ఎందుకు ఏర్పడతాయి? ఎలా నియంత్రించవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..
మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణాలు
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో అతి పెద్ద కారణం తక్కువ నీరు త్రాగడం. శరీరానికి తగినంత నీరు అందనప్పుడు..మూత్రం చిక్కగా మారుతుంది. దానిలో ఖనిజాలు పేరుకుపోవడం ప్రారంభమవుతాయి. దీనితో పాటు, ఉప్పు, టీ, చాక్లెట్, పాలకూర వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కుటుంబంలో ఎవరికైనా గతంలో రాళ్ల సమస్య ఉంటే, జన్యుపరమైన కారణాల వల్ల ఇతరులు కూడా దీనితో బాధపడవచ్చు. కొంతమంది తరచుగా మూత్ర ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటారు. ఇది కూడా ముత్రపిండంలో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
వైద్యులు ఏమి చెప్పారంటే
మూత్రపిండాల్లో రాళ్ల గురించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హిమాన్షు వర్మ మాట్లాడుతూ.. మూత్రపిండాల్లో రాళ్లను యురోలిథియాసిస్ లేదా మూత్రపిండ కాలిక్యులి అని కూడా అంటారు. వీటి పరిమాణం ఇసుక కణం నుంచి గోల్ఫ్ బంతి పరిమాణం వరకు ఉంటుంది. శరీరంలోని టాక్సిన్స్ సరిగ్గా బయటకు రాలేక, కాల్షియం రూపంలో మూత్రపిండాలలో పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు రాళ్ళు ఏర్పడతాయి. ఈ వ్యాధిని సులభంగా నివారించవచ్చు. తినే ఆహారం, జీవనశైలిని మెరుగుపరుచుకుంటే చాలు ఈ సమస్యను నివారించవచ్చు. అంతేకాదు అధికంగా నీరు తాగాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగడంతో పాటు.. చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవడం.. ప్రతిరోజూ వ్యాయామం చేయడం అవసరం.
మూత్రపిండాల్లో రాళ్లను ఎలా నివారించవచ్చు?
కొంచెం జాగ్రత్తగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ పుష్కలంగా నీరు త్రాగాలి. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల వరకూ నీరు తాగాలి. తద్వారా శరీరంలోని మురికి బయటకు వెళుతుంది. మీ ఆహారాన్ని సమతుల్యంగా.. తేలికగా ఉండేలా చూసుకోవాలి. తక్కువ ఉప్పు .. అధిక ప్రోటీన్ ఆహారాలు తినండి. బయటి ఫాస్ట్ ఫుడ్ లేదా ప్యాక్ చేసిన వస్తువులకు దూరంగా ఉండండి. మూత్ర విసర్జన చేసే సమయంలో మంట లేదా నొప్పి తో తరచుగా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. మూత్ర విసర్జనను ఎప్పుడూ ఆపుకోకండి. లేకుంటే మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్ , మూత్రపిండాల్లో రాళ్ళు రెండూ సంభవించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..