AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. పిలిచినా ఈ ఏడు చోట్లకు వెళ్లవద్దు.. ఎందుకో తెలుసా..?

Chanakya Neeti: ఆచార్య చాణక్యుడు మానవుడి ప్రవర్తన గురించి అనేక సూచనలు చేశారు. అలాంటి విలువైన సూక్తుల్లో ఒకటి.. “పిలిచినా కొన్ని చోట్లకు వెళ్లకూడదు” అన్న హెచ్చరిక. అసలు చాణక్యుడు ఏడు చోట్లకు ఎందుకు వెళ్లవద్దన్నాడు? వాటి వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఇప్పటి కాలంలో అవి ఎంతవరకు వర్తిస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

Chanakya Niti: చాణక్యుడి హెచ్చరిక.. పిలిచినా ఈ ఏడు చోట్లకు వెళ్లవద్దు.. ఎందుకో తెలుసా..?
Chanakya Niti
Rajashekher G
|

Updated on: Feb 07, 2026 | 9:15 AM

Share

ప్రాచీన భారతదేశంలో రాజనీతి, జీవన విజ్ఞానానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు ఆచార్య చాణక్యుడు. ఆయన చెప్పిన సూక్తులు నేటికీ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నాయి. మానవ జీవితంలో ఎదుర్కోనే చాలా సమస్యలకు ఆయన తన నీతిశాస్త్రంలో పరిష్కారాలను తెలియజేశారు. మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనే విషయాలను స్పష్టంగా తెలియజేశారు. అలాంటి విలువైన సూక్తుల్లో ఒకటి.. “పిలిచినా కొన్ని చోట్లకు వెళ్లకూడదు” అన్న హెచ్చరిక. అసలు చాణక్యుడు ఏడు చోట్లకు ఎందుకు వెళ్లవద్దన్నాడు? వాటి వెనుక ఉన్న అర్థం ఏమిటి? ఇప్పటి కాలంలో అవి ఎంతవరకు వర్తిస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

చాణక్యుడు చెప్పిన ఆ ఏడు చోట్లు ఇవే..

1. అవమానం జరిగే చోటు

ఎక్కడైతే మన గౌరవాన్ని తక్కువగా చూస్తారో, మాటలతో లేదా ప్రవర్తనతో అవమానిస్తారో.. అలాంటి చోటుకు పిలిచినా వెళ్లవద్దని చాణక్యుడు చెబుతాడు. ఆత్మగౌరవం కోల్పోతే, జీవితం బలహీనమవుతుంది అనేది ఆయన భావన.

2. అవసరం లేని వాదనలు జరిగే చోటు

నిజం చెప్పినా అర్థం చేసుకోని, వాదనలతోనే కాలం గడిపే చోటు మన మానసిక శక్తిని హరించేస్తుంది. అందుకే శాంతి లేని చోటు నుంచి దూరంగా ఉండటం బుద్ధిమంతుడి లక్షణం అని చాణక్యుడు అంటాడు.

3. దుష్టుల సాంగత్యం ఉన్న చోటు

చెడు ఆలోచనలు, కుట్రలు, అసత్య మార్గాలు నడిచే చోటుకు వెళ్లడం మనపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. “సాంగత్య దోషం వల్ల మంచివాడూ చెడిపోతాడు” అనే సిద్ధాంతాన్ని చాణక్యుడు స్పష్టంగా చెబుతాడు.

4. ఋణం ఇచ్చి తిరిగి రాని చోటు

డబ్బు, సహాయం, మద్దతు ఇచ్చినా విలువ ఇవ్వని చోటుకు తిరిగి వెళ్లడం అవివేకమని చాణక్యుడు హెచ్చరిస్తాడు. ఇది కేవలం ధనం గురించే కాదు.. సమయం, శ్రమ, నమ్మకం కూడా ఋణమే అవుతుందని చెబుతాడు.

5. నీతి లేని అధికారుల దగ్గర

న్యాయం, ధర్మం లేని అధికార వ్యవస్థ దగ్గరకు వెళ్లినా ప్రయోజనం ఉండదని చాణక్యుడి అభిప్రాయం. అక్కడికి వెళ్లడం వల్ల సమస్యలు పరిష్కారమయ్యే బదులు మరింత పెరుగుతాయని హెచ్చరిస్తున్నాడు.

6. జ్ఞానం లేని చోటు

బోధించేవారు ఉన్నా, నేర్చుకునే ఆసక్తి లేని చోటుకు వెళ్లడం వృథా. వినని చెవులకు ఉపదేశం చేసినా ప్రయోజనం లేదని చాణక్యుడు స్పష్టం చేశారు. అందుకే అలాంటి ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు.

7. స్వార్థపూరితమైన బంధాలు ఉన్న చోటు

అవసరం ఉన్నప్పుడు మాత్రమే గుర్తు పెట్టుకునే.. ఉపయోగం తీరిన వెంటనే దూరం పెట్టే సంబంధాల దగ్గరకు పిలిచినా వెళ్లవద్దని ఆయన సూచించాడు. ఇవి మన భావోద్వేగాలను దెబ్బతీస్తాయి. అలాంటి చోటుకు వెళితే మన ప్రశాంతత దెబ్బతింటుందని హెచ్చరించాడు.

చాణక్యుడి సందేశం ఏమిటి?

చాణక్యుడు ఈ సూక్తి ద్వారా చెప్పాలనుకున్నది ఒక్కటే.. మన జీవితం విలువైనది. దానిని ఎక్కడ, ఎవరి కోసం ఖర్చు చేయాలో జాగ్రత్తగా ఎంచుకోవాలి. పిలిచారని మాత్రమే వెళ్లిపోవడం బలహీనత అవుతుంది. వెళ్లాలా వద్దా అని ఆలోచించడం విజ్ఞత అని చెప్పారు.

నేటి సమాజానికీ వర్తిస్తాయి..

సోషల్ మీడియా, ఆఫీస్ పాలిటిక్స్, నకిలీ సంబంధాల మధ్య జీవిస్తున్న నేటి సమాజంలో చాణక్యుడి ఈ మాటలు మరింత అవసరం అయ్యాయి. చాణక్యుడి ఆలోచనలు కాలాతీతమైన జీవన మార్గదర్శకాలు అని చెప్పొచ్చు. పిలుపు కన్నా విలువ ముఖ్యం. సంబంధం కన్నా స్వాభిమానం ముఖ్యం. సాంగత్యం కన్నా శాంతి ముఖ్యం.. అందుకే చాణక్యుడు.. పిలిచినా ఈ ఏడు చోట్లకు వెళ్లవద్దు అని స్పష్టంగా హెచ్చరించాడు.