మీ పాదాల్లోనే మీ ఆరోగ్య రహస్యం.. ఈ లక్షణాలను లైట్ తీసుకుంటే అంతే సంగతులు..
పాదాలు కేవలం నడవడానికే కాదు.. అవి మన హెల్త్ ఇండికేటర్స్ కూడా.. కానీ మన శరీరంలో దాగున్న భయంకరమైన రోగాల గురించి పాదాలు ముందే హెచ్చరిస్తాయని మీకు తెలుసా? అవును.. మీరు నడిచే తీరు, మీ పాదాల ఉష్ణోగ్రత, కాలి గోళ్లలో వచ్చే మార్పులు మీ గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి అద్దం పడతాయి. ఆసక్తికరమైన పాదాల రహస్యాలు తెలుసుకుందాం..

సాధారణంగా మనం ముఖంపై చూపించే శ్రద్ధ పాదాలపై చూపం. కానీ మన శరీరంలో ఏ చిన్న అనారోగ్యం తలెత్తినా, దాని ముందస్తు హెచ్చరిక సంకేతాలు పాదాల రూపంలోనే కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు.. తీవ్రమైన వ్యాధులను మన పాదాలు ఎలా సూచిస్తాయో జర్నల్ ఆఫ్ డయాబెటిస్ వంటి అంతర్జాతీయ పరిశోధనలు వెల్లడించాయి. మీ పాదాలలో కనిపించే ఈ 5 హెచ్చరిక సంకేతాల గురించి తప్పక తెలుసుకోండి..
తిమ్మిర్లు – జలదరింపు
అరికాళ్లు లేదా కాలి వేళ్లలో తరచుగా తిమ్మిర్లు రావడం, సూదులతో గుచ్చినట్లు జలదరింపుగా అనిపించడం డయాబెటిక్ న్యూరోపతికి సంకేతం కావచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో లేనప్పుడు నరాలు దెబ్బతింటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పాదాలపై పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి తీవ్ర సమస్యలకు దారితీస్తుంది.
తగ్గని నొప్పి – వాపు
పాదాలు నిరంతరం నొప్పిగా ఉండటం లేదా బరువుగా అనిపించి వాపు రావడం గుండె వైఫల్యానికి లేదా రక్త ప్రసరణ సమస్యలకు సంకేతం కావచ్చు. నడిచినప్పుడు నొప్పి పెరిగి, విశ్రాంతి తీసుకుంటే తగ్గడం అనేది హృదయ సంబంధిత వ్యాధుల లక్షణం అని 2022లో జరిగిన ఒక అధ్యయనం తెలిపింది.
చర్మం రంగు మారడం – పగుళ్లు
పాదాల చర్మం విపరీతంగా పొడిబారడం, పగుళ్లు రావడం లేదా చర్మం రంగు నీలం, ఎరుపు రంగులోకి మారడం రక్త ప్రసరణ సరిగ్గా లేదని సూచిస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు పాదాలపై పుండ్లు పడితే అవి త్వరగా మానవు. ఇవి ముదిరితే విచ్ఛేదనం చేసే పరిస్థితి కూడా రావచ్చు.
ఎప్పుడూ చల్లగా ఉండే పాదాలు
వాతావరణంతో సంబంధం లేకుండా మీ పాదాలు అసాధారణంగా చల్లగా ఉంటున్నాయా? అయితే అది పరిధీయ ధమని వ్యాధి కావచ్చు. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడి పాదాలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గోళ్లలో మార్పులు – వైకల్యాలు
కాలి గోళ్లు మందంగా మారడం, పసుపు రంగులోకి మారడం ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను సూచిస్తాయి. అలాగే కాలి వేళ్ల ఆకృతి మారడం వంటివి రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల వ్యాధులకు సంకేతాలు కావచ్చు.
పాదాల ఆరోగ్యం అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు, అది మీ మొత్తం శరీర ఆరోగ్యాన్ని కాపాడే ఒక సాధనం. ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
