Tourism India: రూ. 400కే గోవా టూర్.. తక్కువ ఖర్చుతో పర్యటనకు బెస్ట్ ఆప్షన్.. పూర్తి వివరాలు ఇవే!
భారతదేశంలో ఆగ్రాలోని తాజ్‌మహల్, కేరళ బ్యాక్‌వాటర్స్, రాజస్థాన్‌లోని రాజభవనాలు వంటి అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయినా, గోవా అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలుస్తుంది. దేశీయ పర్యాటకులతో పాటు విదేశీయులను కూడా ఈ ప్రాంతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. గోవా సుందరమైన బీచ్‌లు, సందడిగా ఉండే రాత్రులు, చారిత్రక చర్చిలు, పోర్చుగీస్ వాస్తుశిల్పానికి ప్రసిద్ధి.

గోవా… అందమైన సముద్ర తీరాలు, ఉల్లాసభరితమైన సంస్కృతి, రంగుల పార్టీలకు నెలవు. గోవా వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుంటారు. విమాన ప్రయాణం ఖరీదైనదని భావించే వారికి, ఇప్పుడు కేవలం రూ.430కే రైలు టికెట్‌తో గోవాకు వెళ్లే అవకాశం అందుబాటులో ఉంది. సికింద్రాబాద్ నుంచి మడ్గావ్ వరకు ఈ రైలు సేవలు ఉన్నాయి. సముద్రతీరాలను, సాగర సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా గోవాను సందర్శించాలనుకుంటారు. గోవా వెళ్లాలనుకోగానే చాలా మందికి విమాన టికెట్ ధరలే గుర్తుకు వస్తాయి. అయితే, ఇప్పుడు రైలులో గోవా (సికింద్రాబాద్ నుంచి మడ్గావ్) వెళ్లవచ్చు. టికెట్ ధర కూడా చాలా తక్కువ.
సికింద్రాబాద్ నుంచి మడ్గావ్ వరకు రైలు ప్రయాణం:
17039 ఎస్‌సీ వీఎస్‌జీ ఎక్స్‌ప్రెస్ (SC VSG Express) సికింద్రాబాద్ నుంచి గోవాలోని మడ్గావ్ వరకు నడుస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరి వాస్కో-డ-గామా (మడ్గావ్) చేరుకుంటుంది. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. 19 గంటల ప్రయాణం తర్వాత ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గోవా చేరుకుంటుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఉదయం 10:05 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు వాస్కో-డ-గామా చేరుకుంటుంది.
టికెట్ ధరలు:
రైలులో నాలుగు రకాల సీట్లు అందుబాటులో ఉన్నాయి:
1A (ఫస్ట్ క్లాస్ ఏసీ): రూ. 2,795
2A (సెకండ్ క్లాస్ ఏసీ): రూ. 1,665
3A (థర్డ్ క్లాస్ ఏసీ): రూ. 1,160
3E (ఏసీ ఎకానమీ): రూ. 1,075
SL (స్లీపర్ కోచ్): రూ. 430
మడ్గావ్ చేరుకున్నాక:
మడ్గావ్‌లో దిగిన తర్వాత పర్యాటకులు ఏ బీచ్‌లకు వెళ్లాలి, ఏ ప్రాంతాలను చూడాలి అనేది నిర్ణయించుకుంటారు. కొందరు దక్షిణ గోవాలో ఉండటానికి ఇష్టపడతారు. మరికొందరు ఉత్తర గోవాకు వెళ్లాలనుకుంటారు.
పర్యాటకులకు ప్రసిద్ధ వసతి ప్రాంతాలు:
కోల్వా: మడ్గావ్ నుంచి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మడ్గావ్‌కు దగ్గరగా ఉన్న ప్రసిద్ధ బీచ్ ప్రాంతం. ఇక్కడ అనేక హోటళ్లు, రిసార్ట్‌లు, గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. కుటుంబాలకు, జంటలకు ఇది మంచి ప్రదేశం.
బెనౌలిమ్: మడ్గావ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కోల్వా కంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మంచి హోటళ్లు, రిసార్ట్‌లు ఉన్నాయి.
వార్కా: మడ్గావ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం తెల్లటి ఇసుక బీచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ లగ్జరీ రిసార్ట్‌లు ఉన్నాయి. మరింత ప్రశాంతత కోరుకుంటే ఇది మంచి ఎంపిక.
కలంగూట్: ఇది మడ్గావ్ నుంచి సుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేరటానికి దాదాపు ఒకటి నుంచి ఒకటిన్నర గంట సమయం పడుతుంది. ఉత్తర గోవాలో ఇది ఒక ప్రసిద్ధ బీచ్. ఇక్కడ రోజువారీ పార్టీలు, సందడి సాధారణం.
అంజునా: మడ్గావ్ నుంచి సుమారు 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేరటానికి దాదాపు ఒక గంట 45 నిమిషాలు పడుతుంది. ఇది కూడా ప్రసిద్ధ బీచ్. ఇక్కడ ప్రతి రోజు పార్టీలు, పర్యాటకుల రద్దీ ఉంటుంది.
మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్‌ను బట్టి ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవచ్చు. మీ బడ్జెట్‌లో గోవా టూర్‌ను ఆస్వాదించవచ్చు. వేసవి సెలవులు దగ్గరలో ఉన్నాయి, అవకాశం దొరికినప్పుడల్లా గోవాను సందర్శించండి. ఈ ప్యాకేజీ బుకింగ్ కోసం మీరు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
