AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్ గాలాలో మెరిసిన హైదరాబాద్‌ ‘క్వీన్’ ధరించిన నెక్లెస్ అన్ని వందల కోట్లా?

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ వేదికగా భావించే ‘మెట్ గాలా’లో సెలబ్రిటీలు తమ అత్యుత్తమ దుస్తులతో సందడి చేస్తుంటారు. ఈ ఏడాది న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరిగిన ఈ వేడుకలో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుధా రెడ్డి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ధరించిన ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్ దుస్తులు, ముఖ్యంగా ఆమె మెడలోని మిలియన్ డాలర్ల నెక్లెస్ ఫ్యాషన్ ప్రియులను ఆశ్చర్యపరిచింది.

మెట్ గాలాలో మెరిసిన హైదరాబాద్‌ ‘క్వీన్’ ధరించిన నెక్లెస్ అన్ని వందల కోట్లా?
Sudha Reddy Met Gala Look
Nikhil
|

Updated on: May 07, 2026 | 6:30 PM

Share

మెట్ గాలా వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదికపై తనదైన ముద్ర వేయడమే కాకుండా, భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సుధా రెడ్డికి దక్కింది. వెండితెర తారల కంటే మిన్నగా మెరిసిపోతూ, సుమారు రూ. 142 కోట్ల విలువైన వజ్రాల హారాన్ని ధరించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం ఆభరణాల తోనే కాకుండా, మనీష్ మల్హోత్రా రూపొందించిన అద్భుతమైన ‘ట్రీ ఆఫ్ లైఫ్’ గౌనుతో మన సంస్కృతిని, వారసత్వాన్ని న్యూయార్క్ ఫ్యాషన్ వీధుల్లో ప్రతిబింబించిన సుధా రెడ్డి మెట్ గాలా ప్రయాణం గురించి తెలుసుకుందాం..

‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’

సుధా రెడ్డి ధరించిన ఈ అద్భుతమైన నెక్లెస్ ఆమె సొంత కలెక్షన్ లోనిది. దీని విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 142.8 కోట్లు) ఉంటుందని అంచనా. ఈ నెక్లెస్ ప్రత్యేకతలు..

  • విక్టోరియన్ ఫినిషింగ్: పెద్ద పెద్ద పియర్, ట్రయాంగిల్ ఆకారంలో ఉన్న రోజ్-కట్ డైమండ్లతో దీనిని రూపొందించారు.
  • ప్రధాన ఆకర్షణ: నెక్లెస్ మధ్యలో 550 క్యారెట్ల డీప్ వైలెట్-బ్లూ టాంజానైట్ పెండెంట్ ఉంది. టాంజానియాలోని మెరెలానీ హిల్స్ నుంచి సేకరించిన దీనిని ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ అని పిలుస్తారు.
  • మరిన్ని ఆభరణాలు: దీనికి జతగా 30 క్యారెట్ల రోజ్-కట్ పోల్కీ డైమండ్ రింగ్, 40 క్యారెట్ల అసెర్-కట్ కొలంబియన్ ఎమరాల్డ్ రింగ్‌ను ఆమె ధరించారు.

మనీష్ మల్హోత్రా అద్భుతం

సుధా రెడ్డి ధరించిన ఈ ప్రత్యేకమైన గౌనును ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు. ‘ట్రీ ఆఫ్ లైఫ్’ (జీవన వృక్షం) థీమ్‌తో తయారైన ఈ దుస్తుల వెనుక లోతైన అర్థం దాగి ఉంది.

  • కళాకృతులు: దక్షిణ భారత సంప్రదాయం మరియు కలంకారీ కళను ప్రతిబింబించేలా దీనిని మలిచారు.
  • డిజైన్ విశేషాలు: ఇందులో స్కల్ప్టెడ్ వెల్వెట్, యాంటిక్ గోల్డ్ జరీ మరియు జిగేల్మనే జర్దోసీ వర్క్‌ను ఉపయోగించారు. ఇవి 3000 ఏళ్ల నాటి వస్త్ర సంప్రదాయానికి ప్రతీకగా నిలిచాయి.
  • మోటిఫ్స్: పాలపిట్ట, జమ్మి చెట్టు, కల్పవృక్షం, తంగేడు పువ్వు, సూర్యచంద్రుల చిత్రాలతో ఈ గౌనును అద్భుతంగా తీర్చిదిద్దారు.

హైదరాబాద్ గౌరవాన్ని చాటిచెప్పి..

హైదరాబాద్ తన జన్మస్థలమే కాకుండా, తన జీవనశైలిలో ఒక భాగమని సుధా రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వేల గంటల కష్టం, తరతరాల జ్ఞానం ఈ ఒక్క దుస్తుల్లో నిక్షిప్తమై ఉందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. మన వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడమే తన లక్ష్యమని ఆమె వివరించారు. సుధా రెడ్డి 2021లో మొదటిసారి మెట్ గాలాలో అడుగుపెట్టారు. అప్పుడు ఫల్గుణి షేన్ పీకాక్ గౌనులో మెరిసిన ఆమె, ఈసారి తన అద్భుతమైన నెక్లెస్, దేశీయ కళతో ప్రపంచాన్ని ఫిదా చేశారు.

Follow Us