Penguin Divorce: ఓరి దేవుడా.. మనిషిలా తయారవుతున్న పెంగ్విన్లు..పెరిగిపోతున్న సహజీనం, వివాహేతర సంబంధాలు, విడాకులు
మంచు పర్వతాలలో నివసించే జీవుల్లో పెంగ్విన్లు ఒకటి. ఇవి పక్షులే కానీ ఎగురలేవు మనిషి వలెనే రెండు కాళ్లతో నడుస్తాయి. అంతేకాదు మగ పెంగ్విన్ గొంతు వద్ద ఉన్న పర్స్ వంటి దానిలో ఏర్పడిన పాల వంటి కొవ్వు ద్రవాన్ని తమ పిల్లలకు ఆహారంగా అందిస్తాయి. అంతేకాదు ఈ పెంగ్విన్‌లకు మానవులకు మరింత దగ్గర సంబంధం ఉందని.. మనుషుల ఆలోచనలు, అలవాట్లు వీటికి కూడా ఉన్నాయని... దశాబ్ద కాలం పాటు జరిగిన ఒక అధ్యయనంలో తెలిసిందని పరిశోధకులు చెబుతున్నారు.

దశాబ్దం పాటు జరిగిన ఒక అధ్యయనంలో మానవుల మాదిరిగానే పెంగ్విన్‌లు కూడా ప్రేమలో పడతాయి. తరచుగా “జీవితాంతం సహజీవనం” చేస్తాయి. అయితే ఓ వైపు భాగస్వామితో ఉంటూనే మరొక భాగస్వామి కోసం వెతుకుతాయని తేలింది. ఫిలిప్ ద్వీపంలో 37,000 చిన్న పెంగ్విన్‌ల కాలనీలో దాదాపు 13 సంతానోత్పత్తి సీజన్లలో అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పెంగ్విన్‌ల మధ్య “విడాకులు” చాలా సాధారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇప్పటివరకు పెంగ్విన్‌లు మాత్రమే ఏకస్వామ్య జీవులుగా గుర్తించబడ్డాయి. అంటే తమ జీవితాంతం ఒక భాగస్వామితో గడుపుతాయి.. తమ ఆనందాన్ని, దుఃఖాన్ని పంచుకుంటాయి. ఇంకా అర్ధమయ్యే రీతితో చెప్పాలంటే పెంగ్విన్‌లు ఒక్కసారి మాత్రమే ప్రేమలో పడతాయి. ఒకసారి తమ జీవిత భాగస్వామిని కలిసిన తర్వాత.. జీవితకాలం జంటగా జీవిస్తాయి. అవి ఎప్పుడూ కొత్త భాగస్వామిని వెతుక్కోవడానికి ప్రయత్నించినట్లు అనిపించలేదని చెప్పారు. అయితే పెంగ్విన్‌లలో కూడా జీవించే విధానం.. ఒకే జీవిత భాగస్వామి అనే సంప్రదాయం విచ్ఛిన్నమవుతోంది. మగ, ఆడ పెంగ్విన్‌లు ఒక భాగస్వామిని విడిచిపెట్టి మరొకరి కోసం వెతుకుతున్నాయని ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయన సహ రచయిత రిచర్డ్ రీనా అన్నారు.
ఇప్పుడు పెంగ్విన్ లో కూడా విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. విడాకులు తీసుకోగానే పెంగ్విన్‌లు గుంపులు గుంపులుగా ఆ జంట ఇంట్లోకి చొరబడుతున్నాయి. అయితే, తమ భాగస్వామి నుంచి విడిపోయి కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత కూడా కొత్త పెంగ్విన్‌ల జంట సంతోషంగా ఉండడం లేదు. కొత్త భాగస్వామితో కూడా వాదనలు నెలకొంటున్నాయి.
దీనికి కారణం పెంగ్విన్లలో మారుతున్న ప్రాధాన్యతలే అయి ఉండవచ్చు అని పెంగ్విన్ నిపుణుడు డెర్ రోట్లర్ అంటున్నారు. అయితే ఇలా భాగస్వామిని రాత్రికి రాత్రే మార్చడం లేదు. చాలా కాలంగా ఒకే భాగస్వామికి అలవాటు పడిన వారు సైతం గత కొంత కాలమగా కోపంతో సంబంధాలను తెంచుకుంటున్నాయి. కొత్త భాగస్వామిని వేడుకుకుంటున్నాయి. అయితే కొత్త భాగస్వామికి కూడా అలవాటు పడలేకపోతున్నాయి. దీంతో కొత్త జంట కూడా ఒకరిపై ఒకరు తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి అని చెప్పారు.
గత 12 సంవత్సరాలుగా పెంగ్విన్‌లపై పరిశోధనలు నిర్వహించిన తర్వాత శాస్త్రవేత్తల బృందం ఈ సమాచారాన్ని ఒక అధ్యయనంలో వెల్లడించింది. ఆ జట్టుకు రోట్లర్ నాయకత్వం వహించాడు. మంచు కరగడం వల్ల పెంగ్విన్‌లకు అతి పెద్ద ప్రమాదం పొంచి ఉందని.. అంతేకాదు వాతావరణంలో మార్పులే పెంగ్విన్‌ల సంబంధంపై ఒత్తిడికి కారణం అని ఆయన అంటున్నారు. వీటన్నింటి కారణంగా రానున్న కాలంలో పెంగ్విన్‌ల సంఖ్య తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిలిప్ ద్వీపంలోని పెంగ్విన్‌లపై జరిగిన ఈ పరిశోధన పక్షి జాతుల సామాజిక గతిశీలతపై కీలకమైన అంతర్దృష్టిని తెలియజేస్తుంది. అంతేకాదు పెంగ్విన్‌లను రక్షించడానికి పరిరక్షణ ప్రయత్నాలను మెరుగ్గా ప్లాన్ చేయడంలో సహాయ పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..