Ramadan 2022: రోజా సమయంలో నీరసంగా అనిపిస్తోందా? అయితే ఇఫ్తార్‌లో ఈ హెల్దీ డ్రింక్స్‌ను భాగం చేసుకోండి..
Ramadan 2022: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాదాపు ఒక నెల పాటు రోజా (ఉపవాసాలు) ఆచరిస్తారు. ఉపవాస సమయంలో సెహెరీ, ఇఫ్తార్ మధ్య దాదాపు 12 నుంచి 14 గంటల పాటు కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉండాల్సి ఉంటుంది
Ramadan 2022: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు దాదాపు ఒక నెల పాటు రోజా (ఉపవాసాలు) ఆచరిస్తారు. ఉపవాస సమయంలో సెహెరీ, ఇఫ్తార్ మధ్య దాదాపు 12 నుంచి 14 గంటల పాటు కనీసం మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉండాల్సి ఉంటుంది. దీంతో సాయంత్రమయ్యే సరికి శరీరంలోని దాదాపు మొత్తం శక్తి అయిపోయింది. పైగా వేసవి కాబట్టి నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇఫ్తార్ సమయంలో తక్షణ శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా లిక్విడ్ డైట్ తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉంటారని నిపుణులు చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం రండి.
ఖర్జూరం- ఓట్స్ మిల్క్ షేక్
సాధారణంగా ఇఫ్తార్ సమయంలో ఖర్జూరం తిన్నాకే ఉపవాసం విరమిస్తారు. అయితే వీటిని నేరుగా తినడంతో పాటు కావాలంటే ఖర్జూరం షేక్ చేసి రోజా విరమించువచ్చు. దీనివల్ల శరీరంలోని నిస్సత్తువ మాయమైపోతుంది. అంతేకాదు ఆరోగ్య పరంగా శరీరానికి పలు ప్రయోజనాలను అందిస్తుంది. ఖర్జూరం-ఓట్స్ మిల్క్ షేక్ తయారుచేసుకోవడానికి సుమారు 10 ఖర్జూరాలు, 1 కప్పు పాలు, 3 చెంచాల ఓట్స్ అవసరం. ముందుగా ఓట్స్‌ను నాన్ స్టిక్ పాన్‌లో వేయించి, గోధుమ రంగులోకి మారిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. ఇప్పుడు విత్తనాలు తీసేసిన ఖర్జూరాలను అరకప్పు పాలలో అరగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత ఓట్స్, ఖర్జూరం, పాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. మిగిలిన పాలను కూడా అందులో కలపాలి. అవసరమైతే మరిన్ని పాలు జోడించవచ్చు. తియ్యదనం కోసం ఈ షేక్‌లో పంచదార కలుపుకోవచ్చు. చక్కెరకు బదులుగా తేనెను కలిపితే అటు రుచిపరంగా, ఆరోగ్య పరంగా మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
పుచ్చకాయ రసం
రోజా సమయంలో ఎక్కువ సేపు ఏమీ తినకుండా, తాగకుండా ఉండడం వల్ల శరీరంలో నీటి స్థాయులు బాగా తగ్గిపోతాయి. బాడీ డీహైడ్రేట్‌కు గురి అవుతోంది. దీని నుంచి ఉపశమనం పొందడం కోసం ఇఫ్తార్ సమయంలో పుచ్చకాయ కానీ, పుచ్చకాయ రసం కానీ తీసుకోవడం ఎంతో మంచింది. ఇది శరీరానికి చల్లదనంతో పాటు తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందుకోసం తొక్క తీసిన పుచ్చకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసి జ్యూసర్ సహాయంతో రసం తీయాలి. ఇందులోకి పుదీనా ఆకులను జోడించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా జ్యూస్ తాగేటప్పుడు చిటికెడు నల్ల ఉప్పు, కాసిన్ని నల్ల మిరియాలు జోడించడం వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలను దూరం చేసుకోవచ్చు.
(Note: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ధృవీకరించదు. అందుకే నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే ఆచరించడం మంచిది)
Also Read: Russia Ukraine War: రష్యాపై అమెరికా మరో ఎత్తుగడ.. UNHRC నుంచి బయటకు పంపేందుకు ప్లాన్..