National Doctors Day-2021 : కరోనా కాలంలో ప్రజలకు దేవుళ్లు వైద్యులే.. ఈ సమయంలో ప్రజలకు వారందించిన సహకారాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఫ్రంట్ లైన్‌లో ఉండి అందరికి సేవలందించారు. “మందులు వ్యాధులను నయం చేస్తాయి కానీ వైద్యులు మాత్రమే రోగులను నయం చేయగలరు” అన్న మాట డాక్టర్లకు సరిగ్గా సూటవుతుంది. ఇన్ని సేవలను అందిస్తున్న వీరిని స్మరించుకోవడం కచ్చితంగా అవసరం.
జూలై 1 న అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం. అయితే ఈ డే ను ఎందుకు జరుపుకుంటారు. దీని వెనకున్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
డాక్టర్స్ డే మొదటగా 1991 నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ కు గౌరవం ఇవ్వడానికి ఈ ప్రత్యేక దినోత్సవాన్ని జూలై 1 న జరుపుకుంటారు. ఆయన 1 జూలై 1882 న జన్మించి 1 జూలై 1962 న మరణించారు. డాక్టర్ రాయ్‌కు భారత్ రత్న లభించింది ఇది ఆయన చేసిన అపారమైన కృషికి గౌరవం. వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాలలో వేర్వేరు తేదీలలో జరుపుకుంటారు.
యునైటెడ్ స్టేట్స్‌లో మార్చి 30 న, క్యూబాలో డిసెంబర్ 3 న జరుపుకుంటారు. ఇరాన్‌లో డాక్టర్స్ డేను ఆగస్టు 23 న జరుపుకుంటారు. మార్చి 1933 లో అమెరికా రాష్ట్రం జార్జియాలో డాక్టర్ డే మొదటిసారి జరుపుకున్నారు. వైద్యులకు గ్రీటింగ్ కార్డులు పంపడం, చనిపోయిన వైద్యుల సమాధులకు పువ్వులు సమర్పించడం ద్వారా ఈ రోజును జరుపుకుంటారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వైద్యులు, నర్సులు ఫ్రంట్‌లైన్ యోధుల పాత్రను బాగా పోషించారు. ఈ సమయంలో వారు ప్రజలను చాలా ప్రోత్సహించారు. కరోనా నయం చేయడానికి తమవంతు ప్రయత్నం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలను తమ వైద్యంతో కాపాడారు. అందుకే డాక్టర్లు దేవుళ్లతో సమానమని చెబుతారు.