- Telugu News Lifestyle International yoga day 2025: Yoga for Anxiety and Sleep these Poses to Reduce Stress
Yoga Day 2025: ఒత్తిడితో నిద్రపట్టడం లేదా.. రోజూ రాత్రి ఈ యోగాసనాలు వేయండి.. నిద్ర లేమి సమస్య తీరుతుంది..
నేటి వేగవంతమైన జీవితంలో చాలా మంది ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. కెరీర్ నుంచి కుటుంబం వరకు ప్రతి విషయంలో ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి ఎప్పుడు ఆందోళనగా, నిరాశగా మారుతుందో మీరు కూడా గ్రహించలేరు. అయితే ఒత్తిడిని నుంచి సకాలంలో బయటపడాలి. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం రాత్రి పడుకునే ముందు కొన్ని యోగాసనాలను ప్రయత్నించాలి. ఇవి ఒత్తిడి నుంచి ఉపశమనం ఇవ్వడంలో సహాయపడతాయి.
Updated on: Jun 14, 2025 | 12:56 PM

ఎవరైనా ఏ విషయం గురించైనా ఆందోళన చెందుతున్నప్పుడు.. అది మొదట నిద్రను ప్రభావితం చేస్తుంది. రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోలేరు. ఈ ప్రభావం మర్నాడు చూపిస్తుంది. మనసు చికాకుగా ఉంటుంది. అంతేకాదు నిద్రలేమి వలన అనేక ఇతర ఆరోగ్య సమస్యలు రావడం ప్రారంభిస్తాయి. క్షీణించిన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగాను ఆశ్రయించాలి. హెల్త్‌లైన్ ప్రకారం.. యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. వాస్తవానికి ప్రతిరోజూ యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే యోగాసనాలను చేయడం వలన శరీరంలో రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా చేరుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి సరిగ్గా ఉంటే.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఒత్తిడి సమస్య నుంచి బయటపడటానికి సహాయపడే యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం.

విపరీత కరణి: ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు ఈ ఆసనం వేయండి. ఇలా చేయడం వల్ల బాగా నిద్ర వస్తుంది. దీని కోసం గోడ దగ్గరగా మీ వీపును ఆన్చి పడుకోండి, తర్వాత మీ కాళ్ళను గోడ వైపుకు నేరుగా పైకి లేపండి. మీ చేతులను మీ శరీరం దగ్గర ఉంచండి. తర్వాత ఈ ఆసనాన్ని 5 నుంచి 10 నిమిషాలు చేయండి. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

ఉత్తనాసనం: ఉత్తనాసనం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. దీని కోసం నిటారుగా నిలబడి మీ చేతులను పైకి లేపండి. నడుము వండి ముందుకు వంగి మీ చేతులతో కాలి వేళ్ళను తాకడానికి ప్రయత్నించండి. ఈ స్థితిలో 1 నిమిషం పాటు ఉండండి. ఈ ఆసనం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంచుతుంది.

శశాంక ఆసనం: ఈ ఆసనం ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుంది. దీనినే కుందేలు భంగిమ అని కూడా అంటారు. కనుక ఈ ఆసనం వేసేటప్పుడు వ్యక్తి కుందేలులా కూర్చోవాలి. దీని కోసం వజ్రాసనంలో కూర్చుని గాలి పీలుస్తూ మీ రెండు చేతులను పైకి లేపండి. భుజాలను చెవులకు దగ్గరగా ఉంచండి. తరువాత ముందుకు వంగి, రెండు చేతులను ముందుకు చాచి, గాలి వదులుతూ అరచేతులను నేలపై ఉంచండి. ఈ స్థితిలో కొంత సమయం ఉండండి.

శవాసనం: శవాసనం అనేది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా మంచి స్థితిలో ఉంచే ఉత్తమ ఆసనాలలో ఒకటి. దీని కోసం మీ వెల్లకిలా పడుకుని చేతులు, కాళ్ళను చాచి ఉంచి, కళ్ళు మూసుకుని దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ ఆసనం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

బాలాసనం: దీనినే పిల్లల భంగిమ అని కూడా అంటారు. ప్రతి రోజు రాత్రి విశ్రాంతి కోసం.. నిద్రపోయే ముందు చేయవలసిన ఆసనం. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం మీ మోకాళ్లపై కూర్చుని ముందుకు వంగి నుదిటిని నేలకు తాకించాలి. చేతులను ముందుకు చాచి శరీరం దగ్గర ఉంచాలి. దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి. ఈ స్థితిలో 2 నిమిషాలు ఉండాలి. ఇది వెన్నునొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

ఒత్తిడి జీవితంలో ఒక భాగమైంది. కనుక ఒత్తిడిని తగ్గించేందుకు మీరు ప్రతి రాత్రి పడుకునే ముందు ఈ 5 రకాల యోగాసనాలను ప్రయత్నించవచ్చు. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ యోగా భంగిమలు ప్రారంభకులకు అనుకూలంగా ఉంటాయి. అంటే మీరు ఇప్పటివరకు యోగా చేయకపోయినా వీటితో ప్రారంభించి మానసిక ఒత్తిడి, నిద్రలేమిని వదిలించుకోవచ్చు.




