Skin Care: మీ చర్మానికి తగ్గ సబ్బును ఎలా సెలెక్ట్ చేసుకోవాలి..?
ప్రతి రోజూ స్నానానికి మనం వాడే ముఖ్యమైన వస్తువుల్లో సబ్బు ఒకటి. కొందరు దీన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు కూడా వాడతారు. అయితే మరి కొందరు సంప్రదాయబద్ధంగా సబ్బుకు బదులుగా పెసరపిండి, శనగపిండి లాంటి సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తుంటారు.

మార్కెట్ లో ఎన్నో రకాల సబ్బులు దొరుకుతున్న ఈ రోజుల్లో మనం వాడుతున్న సబ్బు నిజంగా మన చర్మానికి సరిపోతుందా లేదా కేవలం ప్రకటనల ప్రభావంతోనే కొనుగోలు చేస్తున్నామా అనే ప్రశ్నలు వస్తాయి. అందుకే మీ చర్మ తత్వానికి తగ్గ సబ్బును ఎంచుకోవడం ఎంతో అవసరం. ఇప్పుడు ఈ విషయంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మీ చర్మం సహజంగా పొడిగా అనిపిస్తే మీరు వాడే సబ్బు తేమను నిలుపుకునేలా ఉండాలి. పొడి చర్మానికి గ్లిసరిన్ కలిగిన సబ్బులు చాలా బాగా పని చేస్తాయి. ముఖ్యంగా మేకపాలు కలిగి ఉండే సబ్బులు చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతాయి. వీటిని వాడటం వల్ల చర్మాన్ని పొడిగా చేసే సమస్యలు తగ్గుతాయి.
సులభంగా అలెర్జీలకు లేదా చికాకులకు గురయ్యే చర్మం ఉన్నవారు.. సాధారణ సబ్బులను ఉపయోగించకుండా వైద్యుల సలహాతోనే సబ్బును ఎంపిక చేయాలి. రంగు, సువాసన లేని సబ్బులు సున్నితమైన చర్మానికి మేలు చేస్తాయి. దీని వల్ల చర్మంపై హానికరమైన రసాయనాలు ప్రభావం చూపే అవకాశాలు తగ్గుతాయి.
మీ చర్మం పదే పదే జిడ్డుగా మారుతుంటే.. జిడ్డు ఉత్పత్తిని నియంత్రించే రకమైన సబ్బులను వాడాలి. యాంటీ బాక్టీరియల్ గుణాలున్న సబ్బులు మంచి ఎంపిక. కరివేపాకు, టీ ట్రీ ఆయిల్, లావెండర్ ఆయిల్ లాంటి సహజ ఉత్పత్తులు కలిగిన సబ్బులు చర్మంలోని మొటిమలు, జిడ్డు సమస్యలను తగ్గించగలవు. కావాలంటే సబ్బుకు బదులుగా మంచి బాడీవాష్ ను కూడా ప్రయత్నించవచ్చు.
మనకు ఏదైనా సబ్బు సరిపోతుందని అనిపించి వాడటం మొదలుపెడితే.. చాలా కాలం అదే సబ్బుని వాడుతుంటాం. కానీ శరీరంలో వయస్సు పెరిగే కొద్దీ, కాలం మారే కొద్దీ, హార్మోన్ల ప్రభావం వల్ల చర్మ స్వభావం కూడా మారుతుంది. ఉదాహరణకు యవ్వనంలో నూనెగా ఉండే చర్మం వృద్ధాప్యంలో పొడిగా మారవచ్చు. అలాంటి పరిస్థితుల్లో పాత సబ్బు మన చర్మానికి తగినట్లు ఉండకపోవచ్చు. అందుకే చర్మం ఎలా మారుతుందో గమనిస్తూ అవసరమైనప్పుడు సబ్బును మార్చుకోవాలి. ముఖ్యంగా డెర్మటాలజిస్ట్ లేదా చర్మ వైద్యుల సలహా తీసుకొని సబ్బు మార్పు చేయడం మంచిది.
ఈ విధంగా మీ చర్మానికి అనుగుణంగా సరైన సబ్బును ఎంచుకోవడం ద్వారా.. ఆరోగ్యవంతమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ప్రకటనల కన్నా.. చర్మ అవసరాలపై అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం.
