Mutton: మటన్ కొంటున్నారా.. ఇలా చూసి మోసపోకండి.. తాజా మటన్ మాత్రమే కొనాలంటే ఈ టిప్స్ పాటించండి..
ఒక మధ్యతరగతి వ్యక్తి వారంలో ఒకసారి కేజీ మటన్ కొనాలంటే దాదాపు రెండు రోజుల ఆదాయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. బర్డ్ ఫ్లూ వంటి కారణాలతో చాలా మంది మటన్ షాపులు, చేపల దుకాణాల ముందు లైన్ కడుతున్నారు. కానీ, అంత ధర చెల్లించి మటన్ కొటే అది ఆఖరికి ముదురుగా ఉండటమో, కుళ్లిపోవడమో జరిగితే ఎలా ఉంటుంది. అందుకే మటన్ కొనేవారు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకుంటే తాజా మంటన్ ను ఎంపిక చేసుకోవచ్చు.

ఆదివారం అంటే ఇంట్లో మటన్ వండడం చాలామందికి అలవాటు. వారానికి ఒకసారైనా మటన్ తినాలని ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ వంటి సమస్యల నేపథ్యంలో చాలామంది కోడి మాంసానికి బదులు మటన్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో మటన్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. కానీ, మనం కొనే మటన్ నాణ్యమైనదేనా? అని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
నాణ్యత లేని మాంసం వల్ల ఇబ్బందులు
మటన్ ధరలు ఎక్కువగా ఉండటంతో కొందరు వ్యాపారులు నాసిరకం మాంసాన్ని వినియోగదారులకు అందిస్తున్నారు. కుళ్లిన మాంసం లేదా అనారోగ్యంతో చనిపోయిన గొర్రెలు, మేకల మాంసాన్ని రహస్యంగా విక్రయిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మాంసం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే మటన్ కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
నిబంధనలు పరీక్షలు..
మటన్ విక్రయించే దుకాణాల్లో వెటర్నరీ అధికారులు మాంసం నాణ్యతను పరిశీలిస్తారు. చట్ట ప్రకారం, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేదా పశు వైద్యుడు పరీక్షించిన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. అధికారులు ఆమోదించిన మాంసంపై ఒక ప్రత్యేక ముద్ర ఉంటుంది. ఇలాంటి మాంసాన్ని కొనడమే సురక్షితం. అయితే, చాలా దుకాణాల్లో ఈ నియమాలను పాటించడం లేదు. కాబట్టి, మటన్ కొనేటప్పుడు కొన్ని ముఖ్య విషయాలను గమనించాలి.
మటన్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి:
లైసెన్స్ ఉన్న షాపులు:
అధికారిక లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచి మాత్రమే మటన్ కొనండి. ఇలాంటి చోట్ల మాంసం వైద్య పరీక్షల తర్వాతే విక్రయిస్తారు.
రోడ్డు పక్క దుకాణాలు వద్దు:
మురికి ప్రదేశాల్లో లేదా రోడ్ల పక్కన అమ్మే మటన్‌ను ఎప్పటికీ కొనకండి.
నాణ్యత చెక్ చేయండి:
మాంసం తాజాగా ఉందా లేక కుళ్లిపోయిందా అని చూడండి. అధికారుల ముద్ర ఉన్న మాంసాన్నే ఎంచుకోండి.
గట్టిగా లేదా చల్లగా ఉంటే:
మాంసం గట్టిగా లేదా అతి చల్లగా ఉంటే, అది ఫ్రిజ్‌లో చాలా కాలం నిల్వ ఉంచినది కావచ్చు. ఇలాంటివి కొనకండి. వాసన చూడండి: మాంసం నుంచి చెడు వాసన వస్తే దాన్ని తీసుకోవద్దు. అలాగే, తూకం సరిగ్గా వేస్తున్నారో లేదో కూడా గమనించండి.