Coffee: మెషిన్ కాఫీ తాగేవారిలో పెరుగుతున్న ఆ ముప్పు.. హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు..
స్వీడన్‌లోని ఉప్ప్సాలా విశ్వవిద్యాలయం చల్మర్స్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయంపై కొత్త అధ్యయనం చేశారు. ఈ ఫలితాలు 'న్యూట్రిషన్, మెటాబాలిజం & కార్డియోవాస్క్యులర్ డిసీజెస్' అనే అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. వారు 14 రకాల ఆఫీస్ కాఫీ మెషిన్‌ల నుంచి తీసిన కాఫీ నమూనాలను పరిశీలించగా, మెషిన్ రకం ఆధారంగా కాఫీలో కొలెస్ట్రాల్ పెంచే అంశాల స్థాయిలో గణనీయమైన తేడా కనిపించింది. ఒకే మెషిన్‌లో కూడా వివిధ సమయాల్లో ఈ స్థాయిలు మారుతున్నట్లు గుర్తించారు.

ఆఫీసులో కాఫీ లేని ఒక్క రోజును ఊహించడం కష్టమా? ఉదయం పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు లేదా మధ్యాహ్నం అలసట ఆవహించినప్పుడు, కాఫీ తాగితేనే ఉత్సాహం వస్తుందని భావించే ఉద్యోగులు ఎందరో ఉన్నారు. కానీ, మీ డెస్క్ దగ్గరే ఉన్న కాఫీ మెషిన్‌లో తయారైన ఆ కాఫీ మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా, రోజూ ఆఫీస్ కాఫీ తాగే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం ఏమిటి?
కాఫీలో సహజంగా ఉండే ‘కఫెస్టోల్’ మరియు ‘కాహ్వియోల్’ అనే రెండు రసాయనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయని పరిశోధకులు తెలిపారు. ఇవి రక్తంలో ఎల్ డీఎల్ (చెడు కొలెస్ట్రాల్) పెరిగేలా చేస్తాయి. ముఖ్యంగా, ఎక్కువగా ఉడకబెట్టిన కాఫీలో ఈ రసాయనాలు అధికంగా ఉంటాయి. అందుకే నార్డిక్ దేశాల్లో ఉడికించిన కాఫీని తక్కువగా తీసుకోవాలని ఆహార మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నాయి.
ఏ కాఫీ సురక్షితం?
డ్రిప్-ఫిల్టర్ కాఫీ మెషిన్‌లు వాడితే, కాఫీలో ఈ హానికర రసాయనాలు తక్కువగా ఉంటాయని తేలింది. ఎందుకంటే, పేపర్ ఫిల్టర్ ఈ పదార్థాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. అయితే, కొన్ని ఆఫీస్ కాఫీ మెషిన్‌లు ఈ ఫిల్టరింగ్ ప్రక్రియను సరిగా చేయలేకపోతున్నాయని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది.
ఈ సమస్య నుంచి తప్పించుకోవడం ఎలా?
“రోజుకు 3-4 కప్పుల కాఫీ తాగే ఉద్యోగులు తమ కొలెస్ట్రాల్ స్థాయిలపై దృష్టి పెట్టాలి. ఆఫీసులో పేపర్ ఫిల్టర్‌తో కూడిన కాఫీ మెషిన్‌లను ఉపయోగిస్తే ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు” అని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.
కాఫీ తాగాలనుకుంటే జాగ్రత్త..
ఎందరో ఉద్యోగుల రోజు కాఫీతోనే ప్రారంభమవుతుంది. కానీ, అదే కాఫీ మీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని మర్చిపోకూడదు. ఆరోగ్యం కోసం పేపర్ ఫిల్టర్ కాఫీకి మారడం మంచి ఎంపిక. ఎందుకంటే, రోజూ తాగే ఆఫీస్ కాఫీ మీ శరీరంపై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు.