మెనోపాజ్ లో చర్మం తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
మెనోపాజ్ దశలో చర్మం అనేక మార్పులకు గురవుతుంది. హార్మోన్ల అసమతుల్యత వల్ల చర్మం పొడిబారడం, ముడతలు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. మెనోపాజ్ సమయంలో చర్మాన్ని సంరక్షించుకునే ముఖ్యమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

45 ఏళ్ల తరువాత మహిళల హార్మోన్ల స్థాయిల్లో మార్పులు రావడం వల్ల పీరియడ్స్ పూర్తిగా ఆగిపోతాయి. ఈ దశను మెనోపాజ్ అని అంటారు. మెనోపాజ్ సమయంలో శరీరంలో జరిగే మార్పులు అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా చర్మంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారడం, ముడతలు ఏర్పడటం, కొందరికి మొటిమలు రావడం, అవాంఛిత రోమాల పెరుగుదల వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
ఈ దశలో ఎస్ట్రోజెన్ స్థాయిల్లో అనేక మార్పులు జరుగుతాయి. ఎస్ట్రోజెన్ తక్కువగా ఉండటం వల్ల చర్మం తేమ కోల్పోయి పొడిగా మారుతుంది. కొందరికి ముఖంపై ముడతలు వస్తాయి. కొందరికి మొటిమలు రావడం, ఫైన్లైన్స్ కనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని నివారించేందుకు సరైన చర్మ సంరక్షణ పద్ధతులను పాటించాలి.
మెనోపాజ్ సమయంలో చర్మం పొడిగా మారడంతో పాటు సూర్యరశ్మి ప్రభావానికి కూడా అధికంగా గురవుతుంది. అందుకే ఎస్పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను తప్పనిసరిగా వాడాలి. బయటకు వెళ్లే ముందు దీనిని ముఖానికి, మెడకు అప్లై చేస్తే చర్మానికి రక్షణ కలుగుతుంది.
మెనోపాజ్ సమయంలో చర్మం తేమ కోల్పోయి పొడిగా మారుతుంది. దీని వల్ల ముడతలు త్వరగా రావచ్చు. అందుకే తగిన మాయిశ్చరైజర్‌ను వాడడం చాలా అవసరం. హైలూరోనిక్ యాసిడ్, గ్లిజరిన్, సెరామైడ్లు వంటి చర్మానికి తేమను అందించే పదార్థాలు ఉండే మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
కొంతమందికి మెనోపాజ్ సమయంలో చర్మం ఎర్రగా మారడం, మంట ఉండడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారందరికీ కలబంద జెల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించడమే కాకుండా శీతలతను కూడా ఇస్తుంది. కొందరికి గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కూడా బాగా సహాయపడతాయి.
హార్మోన్ల మార్పుల కారణంగా కొందరికి మెనోపాజ్ సమయంలో ముడతలు, ఫైన్లైన్స్ కనిపించడం ప్రారంభమవుతుంది. దీన్ని తగ్గించేందుకు రెటినాయిడ్ క్రీములను వాడాలి. రెటినాయిడ్స్ విటమిన్ A ఆధారిత పదార్థాలు కావడంతో చర్మ కణాల పునరుద్ధరణకు సహాయపడతాయి.
మెనోపాజ్ సమయంలో కొందరికి ముఖంపై అవాంఛిత రోమాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పై పెదవి ప్రాంతాల్లో అవి ఎక్కువగా కనిపించవచ్చు. దీనిని తొలగించేందుకు థ్రెడ్జింగ్, వ్యాక్సింగ్ లేదా లేజర్ ట్రీట్మెంట్ లాంటి పద్ధతులను ఫాలో అవ్వచ్చు.
మెనోపాజ్ సమయంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత పోషకాహారం తీసుకోవాలి. విటమిన్ C, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినడం వల్ల చర్మానికి తగినంత పోషణ లభిస్తుంది. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం ద్వారా చర్మానికి తేమను అందించవచ్చు.
మెనోపాజ్ కారణంగా కొందరికి నిద్ర లేమి సమస్య ఏర్పడుతుంది. సరైన నిద్ర లేకపోతే చర్మ ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్రను తీసుకోవడం అవసరం.