సమోసా, బజ్జీ కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గమనించకపోతే నష్టమే.. క్యాన్సర్ గ్యారెంటీ!
బజ్జీలు, బోండాలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలను వార్తాపత్రికల్లో చుట్టి తినడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. వార్తాపత్రికల ముద్రణలో ఉపయోగించే సిరాలో ఉండే సీసం, కాడ్మియం వంటి హానికర రసాయనాలు వేడి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలు, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయని పేర్కొంది. అందుకే ఆహారాన్ని ప్యాక్ చేయడానికి ఫుడ్ గ్రేడ్ పేపర్, అల్యూమినియం ఫాయిల్ లేదా అరటి ఆకులను మాత్రమే ఉపయోగించాలని FSSAI హెచ్చరించింది..

వేడి వేడి బజ్జీలు, బోండాలు, వడలు, పకోడీలు, సమోసాలు వంటి వేడి వేడి స్నాక్స్‌ను వార్తాపత్రికల్లో చుట్టి విక్రయించడం దేశవ్యాప్తంగా సాధారణంగా కనిపించే విషయం. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) హెచ్చరించింది. ఆహార పదార్థాలను ముఖ్యంగా నూనెతో కూడిన వేయించిన తినుబండారాలను వార్తాపత్రికల్లో చుట్టి ఇవ్వడం లేదా వాటి నుంచి నూనె పీల్చుకునేందుకు పాత పేపర్లను ఉపయోగించడం వల్ల ప్రమాదకర రసాయనాలు ఆహారంలోకి చేరే అవకాశం ఉందని పేర్కొంది. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్, జీర్ణ సమస్యలు, అవయవాల దెబ్బతినడం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని తెలిపింది.
వార్తాపత్రికలు ఎందుకు ప్రమాదకరం?
నిపుణుల ప్రకారం వార్తాపత్రికలను ముద్రించడానికి ఉపయోగించే సిరాలో సీసం (Lead), కాడ్మియం (Cadmium) వంటి భార లోహాలు ఉంటాయి. వేడి లేదా నూనెతో కూడిన ఆహారం పేపర్‌ను తాకినప్పుడు ఈ రసాయనాలు ఆహారంలోకి కలిసే ప్రమాదం ఉంది. అలాగే సిరాలో ఫార్మాల్డిహైడ్, థాలేట్స్ వంటి విషపూరిత రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశిస్తే హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. వార్తాపత్రికల తయారీలో ఉపయోగించే పునర్వినియోగ కాగితంలో డయాక్సిన్స్ వంటి హానికర రసాయనాలు కూడా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తలెత్తే ఆరోగ్య సమస్యలు ఇవే..
ముద్రణ సిరాలోని కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా పనిచేసే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటు ఇటువంటి ఆహారం తీసుకుంటే జీర్ణాశయ, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పెరగవచ్చు. సీసం వంటి లోహాలు రక్తంలోకి చేరితే మూత్రపిండాలు, కాలేయం, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల, మేధస్సుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ రసాయనాలు రోగనిరోధక శక్తిని బలహీనపరచడంతో పాటు కడుపు పూతలు, వికారం, జీర్ణ సమస్యలు వంటి ఇబ్బందులకు కారణమవుతాయి.
FSSAI సూచనలు
ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి వార్తాపత్రికలకు బదులుగా ఫుడ్ గ్రేడ్ పేపర్, అల్యూమినియం ఫాయిల్ లేదా అరటి ఆకులను ఉపయోగించాలని FSSAI సూచించింది. ఇంట్లో వేయించిన తినుబండారాల నుంచి నూనె తొలగించేందుకు కిచెన్ టిష్యూ పేపర్లను ఉపయోగించాలని, పాత వార్తాపత్రికలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని పేర్కొంది. అలాగే హోటళ్లు లేదా వీధి వ్యాపారులు ఆహారాన్ని వార్తాపత్రికలో చుట్టి ఇస్తే వినియోగదారులు దానిని నిరాకరించాలని సూచించింది. ఆహారం ఎంత పోషకమైనదో, దానిని అందించే పదార్థం కూడా అంతే ముఖ్యమైనది. వార్తాపత్రికలు చదవడానికి మాత్రమే, ఆహారాన్ని ప్యాక్ చేయడానికి కావు అని FSSAI స్పష్టం చేసింది.
