చిటికెలో చేసేయ్.. చింతపండు పులిహోర.. ప్రసాదంగా ఇదే ఎందుకు ఇస్తారో తెలుసా?
పులిహోరకు తెలుగువారికి విడదీయలేని సంబంధం ఉంది. అందులోనూ చింతపండు పులిహోర అంటే మనవాళ్లకు నోట్లో నీళ్లూరుతాయి. ఇక దేవాలయాల్లో ప్రసాదంగా దొరికే పులిహోరకు ఉండే రుచి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పులిహోరను నైవేద్యంగా పెట్టని గుడి ఉండదేమో. ఇక అన్నదానాల్లోనూ మొదటి స్థానం దీనికే ఇస్తారు. చింతపండు పులిహోరలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిన వారు ఎవ్వరైనా దీనిని కాదనలేరు. ఎందుకంటే రుచిలోనే కాదు.. ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ఇది రారాజే..

తెలుగువారి ఏ వంటకాల్లోనైనా పులిహోర మస్ట్ గా ఉంటుంది. గుడిలో దేవుడికి నైవేద్యంగా పెట్టేందుకు పులిహోర అన్నాన్ని పవిత్రంగా భావిస్తారు. ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్లినా పులిహోరనే ప్రసాదంగా ఇస్తారు. ఇంతలా ఈ వంటకానికి మనవారు ప్రాముఖ్యం ఇచ్చారు. అందుకు ప్రధాన కారణం మన శరీరానికి చింతపండు చేసే మేలు అలాంటిది. అందుకే దీంతో చేసే వంటకాలను పండుగలు, పర్వదినాలప్పుడు కూడా కచ్చితంగా చేస్తుంటారు. సరిగ్గా మనసు పెడితే పదంటే పది నిమిషాల్లో చేయగలిగే ఈ పులిహోర వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పులిహోరకు కావలసిన పదార్థాలు..
వండి చల్లార్చిన అన్నం నానబెట్టిన చింతపండు రసం పచ్చిమిర్చి ఇంగువ శనగపప్పు తాలింపు గింజలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఎండుమిర్చి నూనె, పల్లీలు
తయారీ విధానం..
ముందుగా నూనె వేడి చేసుకుని అందులో తాళింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, కరివేపాకు, శనగపప్పు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కాస్త ఇంగువ వేసుకోవచ్చు. ఇష్టం లేని వారు స్కిప్ చేయొచ్చు.
చల్లార్చి పెట్టుకున్న అన్నంలో చింతపండు రసం, ఉప్ప, కారం రుచికి సరిపడా చూసుకుని కలుపుకోవాలి. ఇందులోనే తాళింపు వేసుకుని అన్నం విరగకుండా కలియబెట్టుకోవాలి. తర్వాత గిన్నెతో సహా పొయ్యి మీద పెట్టుకుని కాసేపు వేడి చేసుకోవాలి. అంతే కమ్మనైన పులిహోర రెడీ అయిపోతుంది. చింతపండుతో చేసిన పులిహోరను తరచుగా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..
గుండెకు ఆ రిస్క్ తగ్గిస్తుంది..
నాణ్యమైన చింతపండుతో చేసే ఏ వంటకమైనా శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తుంది. గుండె ఆరోగ్యానికి చింతపండు ఎంతో మంచిది. గుండె కు సరఫరా అయ్యే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేస్తుంది. దీంతో రక్త ప్రసరణ గుండెకు బాగా అందుతుంది. కాబట్టి రోజూ చింత పండును ఏదో రకంగా తీసుకోవచ్చు. అయితే, ఈ పులుపు మితిమీరితే పొట్ట సమస్యలు రావచ్చు.
మలబద్ధకం పోగొడుతుంది..
చింతపండులో ఉండే ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అందుకే ఉగాది సందర్భంగా తెలుగువారు చేసే ఉగాది పచ్చడికి చింతపండునే వాడతారు. ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేసి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించేందుకు ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది. చింత పండు జీర్ణ క్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. అలాగే ప్రేగులను శుభ్ర పరుస్తుంది. దీంతో గ్యాస్, కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. మల బద్ధకం సమస్య కూడా నివారిస్తుంది. తిన్న ఆహారం నిల్వ ఉంచకుండా జీర్ణం చేస్తుంది కాబట్టి.. బరువు కూడా తగ్గొచ్చు.
కొలెస్ట్రాల్ కు మంచిది..
చింత పండులో పోటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న ఫ్లేవనాయిడ్స్ వంటి పాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
