Mutton Recipes: తమిళనాడు స్పెషల్ మటన్ సుక్కా ఫ్రై!.. ఈ సీక్రెట్ పొడి వేస్తే రుచి మామూలుగా ఉండదు!
మటన్ కూర వండినప్పుడు ముక్క గట్టిగా ఉండి సరిగ్గా ఉడకడం లేదని బాధపడుతున్నారా? అయితే తమిళనాడు స్టైల్ "మటన్ సుక్కా" పద్ధతిని ఫాలో అవ్వండి. ఇందులో వాడే ప్రత్యేకమైన మసాలా పొడి ఇల్లంతా సువాసనలు వెదజల్లడమే కాదు, రుచిని అద్భుతంగా మారుస్తుంది. అన్నం, చపాతీ లేదా బగారా రైస్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన ఈ రెసిపీని బిగినర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.

నాన్-వెజ్ వంటకాల్లో మటన్‌కు ఉండే క్రేజే వేరు. ముక్కకు మసాలా బాగా పట్టి, ఫ్రై చేసినా కూడా జ్యూసీగా ఉండే మటన్ సుక్కా అంటే ఇష్టపడని వారుండరు. సాంబార్ ఉల్లిపాయలు (చిన్న ఉల్లిపాయలు) వాడటం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఈ సంక్రాంతి సెలవుల్లో మీ కుటుంబ సభ్యుల కోసం ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే తయారీ విధానంపై ఒక లుక్ వేయండి.
కావలసిన పదార్థాలు:
మటన్ (అర కిలో),
సాంబార్ ఉల్లిపాయలు (సరిపడా).
ఎండుమిర్చి (8),
మిరియాలు (అర స్పూన్),
జీలకర్ర (1 స్పూన్),
సోంపు (అర స్పూన్),
లవంగాలు,
యాలకులు,
దాల్చినచెక్క,
బిర్యానీ ఆకు.
ఇతరాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నూనె, కరివేపాకు, కొత్తిమీర.
తయారీ విధానం :
మటన్ ఉడికించడానికి ముందుగా కుక్కర్‌లో నూనె వేసి కొన్ని సాంబార్ ఉల్లిపాయలు వేయించాలి. ఉల్లిపాయలు వేగాక శుభ్రం చేసిన మటన్ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌లో వేయించాలి. అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఒక నిమిషం వేగనిచ్చి, ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి.
సుక్కా మసాలా పొడికి.. ఒక కడాయిలో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు మరియు కరివేపాకు వేసి సన్నని మంటపై వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
ఫ్రై చేయడం మరో కడాయిలో నూనె పోసి అర కప్పు సాంబార్ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేయించాలి. ఇప్పుడు ఉడికించిన మటన్‌ను (నీళ్లతో సహా) ఇందులో పోసి మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి 4 నిమిషాలు ఉడికించాలి. నీరంతా ఇగిరిపోతున్న సమయంలో మనం సిద్ధం చేసుకున్న మసాలా పొడిని వేసి బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. చివరగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి మటన్ సుక్కా రెడీ!
