నాన్ వెజ్ ప్రియులకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాల్లో తలకాయ కూర కూడా ఒకటి. తలకాయ కూర అనగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. మరి అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. తినే కొద్దీ తినాలని అనిపిస్తుంది. నోట్లోకి అలా ముక్క పెట్టగానే కరిగిపోతుంది. ఈ కర్రీని పులావ్, అన్నం, చపాతీ, రోటీ దేనితో అయినా తినొచ్చు. అయితే చాలా మందికి తలకాయ కూర చేయడం అస్సలు రాదు. కానీ ఒక్కసారి ఈ పద్దతిలో వండారంటే.. తిన్న వాళ్లందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు. అంత రుచిగా వస్తుంది. మరింకెందుకు లేట్ ఈ తలకాయ కూర ఎలా చేస్తారు? ఈ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దం.
తలకాయ కూర, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, కరివేపాకు, కొత్తి మీర, చింత పండు పులుసు, బిర్యానీ దినుసులు, ఆయిల్.
ముందుగా తలకాయ కూరను శుభ్రంగా చేసుకుని దాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి ఓ అరగంటైనా పక్కకు పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ సమయం అయినా పర్వాలేదు. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ముందుగా బిర్యానీ దినుసులు వేసి వేయించుకోవాలి. నెక్ట్స్ ఉల్లి పాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలర్ మారేంత వరకూ ఫ్రై చేయాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. నెక్ట్స్ టమాటా ముక్కలు వేసి, మెత్తగా అయ్యేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న తలకాయ కూర వేసి ఓ పది నిమిషాల పాటు బాగా వేయించాలి.
ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా వేసి ఓ రెండు నిమిషాలు వేయించి.. సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి ఓ ఆరు విజిల్స్ వచ్చాక కట్టేయాలి. ఇప్పుడు కూర సగం ఉడికి ఉంటుంది. ఈ టైమ్‌లో చింత పండు పులుసు కొద్దిగా వేసి.. మళ్లీ మీడియం మంటపై ఓ పది నిమిషాలు ఉడికించాలి. కర్రీ దగ్గర పడుతున్న సమయంలో అన్నీ ఒకసారి రుచి చూసుకుని.. కొత్తి మీర చల్లి స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ తలకాయ కూర సిద్ధం.