
నువ్వులతో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. అంతే కాకుండా కొన్ని రకాల వంటల్లో నువ్వులను కూడా యాడ్ చేసి వండుతూ ఉంటారు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా పిల్లలకు నువ్వులతో చేసిన ఆహారాలు ఇస్తే.. వారి ఎదుగుదలకు చాలా సహాయ పడుతాయి. రక్త హీనత సమస్యతో బాధ పడేవారు నువ్వులు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందులోనూ నువ్వులతో తయారు చేసిన అన్నాన్ని తినడం వల్ల.. పిల్లలకు, బాగా హెల్ప్ అవుతుంది. నువ్వుల అన్నం చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం.
నువ్వులు, ఉడక బెట్టిన అన్నం, ఉప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, ఎండు మిర్చి, వేరుశనగ, మినప్పప్పు, శనగ పప్పు, ఆయిల్.
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి వేడి చేయాలి. పాన్ వేడెక్కాక.. శనగ పప్పు, ఎండు మిర్చి, నువ్వులు, మినప్పప్పు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారాక మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని పక్కన పెట్టు కోవాలి. మళ్లీ ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ లేదా నెయ్యి వేడి చేయాలి. ఆవాలు వేసి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, వేరుశనగ, మినప్పప్పు వేసి వేయించాలి. చివర్లో పసుపు కూడా వేసి వేయించాలి.
ఇప్పుడు ఇందులో వండిన అన్నాన్ని వేసి మెల్లగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా చల్లు కోవాలి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి అన్నం ముద్దలా కాకుండా.. పులిహారలా పొడిగా చేసుకోవాలి. అంతే నువ్వుల అన్నం రెడీ అయినట్టే. ఈ హెల్దీ రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. అంతే కాకుండా ఈ రెసిపీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.