Aloo Bajji Recipe: వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఇలా ఆలూ బజ్జి చేసుకోండి.. టేస్ట్ అదిరిపోద్ది..!
ఆలూ బజ్జీ అందరికీ నచ్చే రుచికరమైన రెసిపీ. మెత్తగా తేలికగా ఉంటూ బయట క్రిస్పీగా ఉండే ఆలూ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆలూ బజ్జీని మొదటిసారి వంట చేసేవాళ్ళు కూడా సులభంగా చేస్తారు. సరైన కొలతలు పాటిస్తే పాడవ్వకుండా మంచిగా, రుచిగా వస్తాయి. ఈ ఆలూ బజ్జీని చాలా మంది ఇష్టంగా తింటారు.

బజ్జీ పిండిలో కొద్దిగా ఇడ్లీ లేదా దోసె మావు కలపడం వల్ల బజ్జీలకు మరింత రుచి వస్తుంది. ఇది పులిసిన పిండి కాబట్టి బజ్జీలు మరింత రుచికరంగా తయారవుతాయి. కొంతమంది ఎక్కువ పిండి కలిపి సోడా లేకుండా కూడా బజ్జీలు చేస్తారు. అయితే చిటికెడు వంట సోడా కలిపితే బజ్జీలు మెత్తగా, పొంగుతూ వస్తాయి.
వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి బజ్జీ తినడం చాలా సరదాగా ఉంటుంది. ఇంట్లో అందరూ కూర్చుని ఆలూ బజ్జీ తింటూ కబుర్లు చెప్పుకోవచ్చు. చల్లని వాతావరణానికి ఇది మంచి కాంబినేషన్. బయట వర్షం కురుస్తుండగా లోపల వేడి బజ్జీ రుచి భలే అనిపిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే స్నాక్ ఇది.
కావాల్సిన పదార్థాలు
- బంగాళాదుంపలు – 2
- శనగపిండి – ½ కప్పు
- బియ్యం పిండి – 3 టేబుల్ స్పూన్లు
- కార్న్ ఫ్లోర్ – 1 టీస్పూన్
- కారం – 1½ టీస్పూన్లు
- పసుపు – ¼ టీస్పూన్
- ఇంగువ – ⅛ టీస్పూన్
- జీలకర్ర – 1 టీస్పూన్
- మిరియాల పొడి – ⅛ టీస్పూన్
- ఆయిల్ – వేయించడానికి సరిపడా
- ఉప్పు – తగినంత
- సోడా – చిటికెడు
- నెయ్యి – 1 టీస్పూన్
- ఇడ్లీ లేదా దోసె మావు – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
బంగాళాదుంపల పొట్టు తీసి లావుగా చక్రాల్లా కట్ చేసి నీటిలో వేయండి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్, కారం, పసుపు, ఇంగువ, జీలకర్ర, మిరియాల పొడి, సోడా, ఉప్పు వేసి బాగా కలపండి. ఈ పిండిలో ఇడ్లీ మావు లేదా దోసె మావు వేసి తగినంత నీటితో కలిపి చిక్కటి మిశ్రమంలా తయారు చేయండి. మీకు వేసుకోవాలి అనుకుంటేనే ఇడ్లీ మావు కానీ దోసె మావు కానీ వేసుకోండి. ఆ తర్వాత నెయ్యి కలిపి మరోసారి కలపండి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి బాగా వేడి కానివ్వండి. బంగాళాదుంప ముక్కలను నీటి నుండి తీసి తడి లేకుండా తుడిచి పిండి మిశ్రమంలో ముంచండి. పిండిలో ముంచిన బంగాళాదుంప ముక్కలను వేడి నూనెలో వేయండి. బజ్జీలపైనా కూడా వేడి నూనె వేస్తూ అటు ఇటు అంటూ ఉంటే బాగా పొంగుతూ క్రిస్పీగా వస్తాయి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు బంగాళాదుంప బజ్జీలను వేయించి తర్వాత టిష్యూ పేపర్ మీద వేయండి. ఇలా వేయడం వల్ల అదనపు ఆయిల్ ను టిష్యూ తీసేసుకుంటుంది. ఆలూ బజ్జీ రెడీ అయ్యింది. వర్షం పడుతుండగా వేడి వేడి ఆలూ బజ్జీని ఇలా చేసుకోని కాఫీతో కలిపి మీ కుటుంబంతో కలిసి ఆస్వాదించండి.
రెసిపీకి సంబంధించి చిట్కాలు
- నెయ్యి వేయడం వల్ల బజ్జీలకు మంచి రుచి వస్తుంది. వాసన కూడా బాగుంటుంది.
- పిండి మిశ్రమం గట్టిగా ఉంటే బజ్జీలు తేలికగా ఉండవు. కాబట్టి నీటిని సరిపడా కలుపుకోవాలి.
- బజ్జీలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటే.. పిండిలో నీరు ఎక్కువగా కలిసి ఉండొచ్చు లేదా సోడా ఎక్కువై ఉండొచ్చు.
