ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ లో క్రిస్పీ చీజ్ ఫ్రైస్ చేయండిలా..! టేస్ట్ మస్తు ఉంటది..!
వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ పైన మెత్తగా కరిగిన చీజ్ సాస్.. హోటల్ కు వెళ్లకుండానే ఇంట్లో తక్కువ పదార్థాల తోనే రెస్టారెంట్ రుచి అనుభవించొచ్చు. ఇప్పుడు ఈ చీజ్ ఫ్రైస్ రెసిపీని ఇంట్లో ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం.

చీజ్ తినాలనిపిస్తుందా..? బంగాళాదుంపలతో చేసిన క్రిస్పీ ఫ్రైస్ పైన వేడి చీజ్ సాస్ వేసి చూడండి.. ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించవచ్చు. హోటల్ కు వెళ్లకుండా కొన్ని సాధారణ పదార్థాలతో ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో ఈ స్నాక్ ను తయారు చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి సినిమా చూసేటప్పుడు లేదా పార్టీలకు ఇది మంచి ఎంపిక.
ఫ్రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
- బంగాళాదుంపలు – 3 లేదా 4 పెద్దవి
- ఆయిల్ – వేయించడానికి సరిపడా
- ఉప్పు – రుచికి సరిపడా
చీజ్ సాస్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
- వెన్న – 2 చెంచాలు
- మైదా – 2 చెంచాలు
- పాలు – 1 కప్పు ఫుల్ క్రీమ్ అయితే మంచిది
- తురిమిన చీజ్ – 1 కప్పు చెడార్ లేదా మోజారెల్లా చీజ్ వాడవచ్చు
- ఉప్పు, మిరియాల పొడి – రుచికి సరిపడా
- వెల్లుల్లి పొడి లేదా పాప్రికా కొద్దిగా – ఆప్షనల్
తయారీ విధానం
ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి తొక్క తీసి పల్చగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా లావుగా లేదా పల్చగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన ముక్కలను కనీసం అరగంట పాటు చల్లటి నీటిలో నానబెట్టండి. దీని వల్ల అవి వేయించినప్పుడు గట్టిగా కరకరలాడేలా ఉంటాయి.
వేయించాలంటే
ఇప్పుడు తగినంత ఆయిల్ ను కడాయి లేదా డీప్ ఫ్రైయర్ లో వేడి చేయండి. బంగాళాదుంప ముక్కలను కొద్ది కొద్దిగా వేసి వేయించాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించి పేపర్ టవల్ మీద వేసి కొద్దిగా ఉప్పు చల్లి పక్కన పెట్టండి.
బేక్ చేయాలంటే
ఓవెన్ ను 220 డిగ్రీల సెల్సియస్ ముందుగా వేడి చేయండి. బంగాళాదుంప ముక్కలకు కొద్దిగా ఆయిల్ రాసి బేకింగ్ ట్రే మీద ఒకదానికొకటి తగలకుండా పరచండి. 25 నుంచి 30 నిమిషాల పాటు కాల్చండి. మధ్యలో ఒకసారి తిప్పడం మర్చిపోవద్దు.
చీజ్ సాస్ తయారీ
ఒక చిన్న గిన్నెలో వెన్నను మధ్య మంట మీద కరిగించండి. అందులో మైదా వేసి కలపండి. ఉండలు లేకుండా మృదువుగా కలుపుతూ 1 నుంచి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత పాలను కొద్ది కొద్దిగా వేస్తూ కదిలిస్తూ కలపండి. చిక్కగా మారాక తురిమిన చీజ్ వేసి కరిగించాలి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, అదనపు రుచికి వెల్లుల్లి పొడి లేదా పాప్రికా వేయవచ్చు.
ఇప్పుడు వేడి వేడి ఫ్రైస్ ను సర్వింగ్ ప్లేట్ మీద వేసుకోవాలి. వెంటనే తయారు చేసిన చీజ్ సాస్ ను దాని పైన వేయండి. మరింత రుచిగా కావాలంటే తురిమిన చీజ్ ను మళ్లీ పైన చల్లి ఓవెన్ లో 2 నుంచి 3 నిమిషాలు ఉంచండి. చీజ్ కరిగిపోయి మెత్తగా అయిపోతుంది. మీ చీజ్ ఫ్రైస్ కి మరింత రుచిని ఇవ్వాలంటే ఈ టాపింగ్స్ ప్రయత్నించండి.
- తరిగిన ఉల్లిపాయ ఆకులు (Chopped green onions)
- వేయించిన బేకన్ ముక్కలు (Crumbled cooked bacon)
- జలపెనో ముక్కలు (Jalapeno slices)
- మయోనైస్ లేదా గార్లిక్ సాస్ వేయవచ్చు
- మిరప పొడి లేదా చిల్లీ ఫ్లేక్స్ వేయండి – కారంగా ఉండటానికి
ఈ చీజ్ ఫ్రైస్ మంచి రుచి ఇవ్వాలంటే వేడి వేడిగానే తినాలి. ఇంకెందుకు ఆలస్యం కూల్ డ్రింక్ తో ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించండి.