ఆంధ్రా స్టైల్.. పుల్లగా, ఘాటుగా.. చూస్తేనే నోరూరే గోంగూర పచ్చడి.. 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి..
ఆంధ్రమాత గోంగూర పచ్చడి.. ఆంధ్రా వంటకాలలో గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. రుచిగా, పుల్లపుల్లగా ఉండే ఈ పచ్చడిని సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముందుగా, రెండు పెద్ద గోంగూర కట్టలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఎర్ర గోంగూర వాడటం పచ్చడి రుచికి ఉత్తమం.

ఆంధ్రమాత గోంగూర పచ్చడి.. ఆంధ్రా వంటకాలలో గోంగూర పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. ఏ ఫంక్షన్ అయినా.. కార్యక్రమం అయినా.. గోంగూర పచ్చడి ఉండాల్సిందే.. దీని రుచి.. అద్భుతంంగా ఉంటుంది.. చూస్తేనే నోరూరించే ఈ ఆంధ్రా స్టైల్ స్పెషల్ గోంగూర పచ్చడిని ఇంట్లో సులువుగా, అద్భుతమైన రుచితో ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ పచ్చడి పుల్లపుల్లగా, కారం కారంగా వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే సూపర్ ఉంటుంది. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.. సింపుల్ గా పచ్చడి 10 నిమిషాల్లో అయిపోతుంది..
తయారీకి కావలసినవి:
పెద్ద సైజు ఎర్ర గోంగూర కట్టలు – 2 .. లేకపోతే మామూలు గోంగూర అయినా సరిపోతుంది.
నూనె – 3-4 టేబుల్ స్పూన్లు
మెంతులు – చిటికెడు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
నువ్వులు – 1 టేబుల్ స్పూన్ (ఐచ్ఛికం)
పచ్చిమిర్చి – 10 (లేదా కారానికి తగినట్లు)
పసుపు – అర టీ స్పూన్
చింతపండు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు) – 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి – 3-4
ఇంగువ – పావు టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 4-5 (కచ్చాపచ్చాగా దంచినవి)
కరివేపాకు – 2 రెమ్మలు
ఉల్లిపాయ – 1 (మీడియం సైజు, సన్నగా తరిగినది)
తయారీ విధానం:
మొదటగా, రెండు పెద్ద గోంగూర కట్టల నుండి ఆకులను విడదీసి, మూడు నుండి నాలుగు సార్లు నీటిలో శుభ్రంగా కడగాలి. ఎర్ర గోంగూర వాడటం పచ్చడికి మంచి రుచిని ఇస్తుంది.. దీని కాడలు ఎర్రగా ఉంటాయి. కడిగిన గోంగూరను పక్కన పెట్టుకోండి.
ఒక పాన్‌ను వేడి చేసి, అందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కగానే చిటికెడు మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్‌గా వేగనివ్వాలి. తరువాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవచ్చు, ఇవి పచ్చడి రుచిని పెంచుతాయి (నువ్వులు ఐచ్ఛికం). నువ్వులు కొద్దిగా వేగిన తర్వాత, మీ కారానికి తగినట్లు పచ్చిమిర్చి వేసి మూత పెట్టి వేగనివ్వాలి. గోంగూర పులుపుకు తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి.
పచ్చిమిర్చి వేగిన తర్వాత, మూత తీసి ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను మొత్తం పాన్‌లో వేసి, మళ్ళీ మూత పెట్టి, మంటను లో లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గోంగూర బాగా మగ్గనివ్వాలి. సుమారు మూడు నుండి నాలుగు నిమిషాల తర్వాత గోంగూర బాగా మగ్గుతుంది. మగ్గిన గోంగూరను ఒకసారి బాగా కలిపి, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు (ఇది రుచిని పెంచుతుంది, వద్దనుకుంటే మానేయవచ్చు) వేసి బాగా కలిపి, మరోసారి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గనివ్వాలి. గోంగూర, పచ్చిమిర్చి బాగా మగ్గి, నూనె కొద్దిగా పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
చల్లారిన గోంగూర మిశ్రమాన్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. రోట్లో దంచితే మరింత రుచిగా ఉంటుంది.. కానీ మిక్సీలో చేసుకునే వారు మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా, బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మూడు లేదా నాలుగు సార్లు పల్స్ ఇస్తే సరిపోతుంది. మరీ మెత్తగా చేస్తే పచ్చడి రుచి తగ్గుతుంది.
ఇప్పుడు పోపు కోసం, మరో పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కగానే ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు) వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేగనివ్వాలి. తరువాత మూడు లేదా నాలుగు ఎండుమిర్చిని తుంచి వేసి, పావు టీ స్పూన్ ఇంగువ, కచ్చాపచ్చాగా దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి పోపును వేగనివ్వాలి. పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే, ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసి, పోపుతో బాగా కలపాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిగానే ఉండాలి, అప్పుడే గోంగూర పచ్చడికి మంచి రుచి వస్తుంది.
చివరగా, ఈ పోపు మిశ్రమాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసి బాగా కలపాలి. అవసరమైతే ఉప్పు సరిచూసుకొని కలుపుకోవచ్చు. ఇలా తయారు చేసిన ఆంధ్రా గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఆస్వాదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
