Fish Pickle: మీకు చేపలంటే ఇష్టమా.. రుచికరమైన చేపల పచ్చడిని పెట్టుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం
మాంసాహార ప్రియులు చికెన్ , మటన్ లతో పాటు చేపలు, రొయ్యలు, పీతలు, వంటి సీ ఫుడ్ ని కూడా ఇష్టంగా తింటారు. అయితే సీ ఫుడ్ లో చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి అని నిపుణులు చెబుతున్నారు. అందుకనే తినే ఆహారంలో చేపలను చేర్చుకోమని సూచిస్తున్నారు. చేపలతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. అయితే రుచికరమైన చేపల పచ్చడిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

చేపలను తినే ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మహిళలు, పిల్లలు, వృద్ధులు అనే తేడా లేదు.. ఎవరికైనా ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి చేపలు. వీటిని తినడం వలన బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చేపలతో చేపల పులుసు, ఫ్రై, కూర వంటి వాటితో పాటు ఫిష్ బిర్యానీ వంటి రుచికరమైన ఆహరాన్ని తయారు చేసుకుని ఇష్టంగా తింటారు. ఈ రోజు టేస్టీ టేస్టీ చేపల పచ్చడి రెసిపీ గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు
- చేపముక్కలు : అరకిలో
- కారం : అరకప్పు
- దాల్చిన చెక్క : ఒక చిన్న ముక్క
- యాలకులు : 1
- లవంగాలు : 2
- వెల్లుల్లి : పేస్ట్
- కరివేపాకు – కొంచెం
- ఉప్పు : ఒక టేబుల్ స్పూన్
- నూనె : అరకిలో
- నిమ్మకాయ : 1
తయారీ విధానం: ముందుగా చేపలను కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత చేపలను ఒక బట్ట మీద వేసి ఆరబెట్టాలి. చేప ముక్కల్లోని నీరు ఇంకిపోయేలా చేయాలి. ఇంతలో మిక్సీ గిన్నె తీసుకుని అందులో లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేసి మసాలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో వేయించడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఆరబెట్టుకున్న చేప ముక్కలను నూనె లో వేసి కొంచెం సేపు వేయించాలి. (ఎక్కువ సేపు చేప ముక్కలను వేయించవద్దు. ఉడికేలా వేయిస్తే చాలు). నూనెనుంచి చేపలను తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
ఇపుడు వేడిగా ఉన్న నూనె లో వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారం, ఉప్పు, మసాలా పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత వేయించుకున్న చేప ముక్కలను ఈ మసాలా పేస్ట్ లో వేసుకుని మెల్లగా చేప ముక్కలు విరగకుండా కలుపుకోవాలి. నూనె వేడి తగ్గిన తరవాత నిమ్మరసం వేసుకుని ఉప్పు, కారం చూసుకోవాలి. సరిపడకపోతే మళ్ళీ మీ రుచికి అనుగుణంగా అడ్జెస్ట్ చేసుకోవాలి. అంతే చేప పచ్చడి రెడీ.. దీనిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకుని తడి తగలకుండా నిల్వ చేసుకుంటే దాదాపు నెల రోజులు ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








