Drumstick Leaves Chutney: రుచికరమైన మునగాకు పచ్చడిని ఇలా చేసుకోండి.. వారానికి రెండు సార్లు తినడం ఆరోగ్యకరం..
మునగకాయలు మాత్రమే కాదు మునగాకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మునగ కాయలతో కూర, పులుసులతో పాటు మునకకాయ పచ్చడి వంటి అనేక రకాల పదార్ధాలను తయారు చేస్తారు. అయితే పల్లెటూర్లలో మునగాకుతో పప్పు , మునగాకు కారం, మునగాకు పచ్చడి వంటివి తయారు చేసుకుని తింటారు. ఈ రోజు అమ్మమ్మ కాలం నాటి ఆరోగ్యకరమైన మునగాకు పచ్చడి రెసిపీ మీ కోసం..

అత్యధిక పోషకాలు, విలువైన ఔషధాలు కలగలిసిన అద్భుతమైన ఆకు పచ్చ బంగారం మునగాకు. పెద్దలు ఈ మునగాకుని తినే ఆహారంలో చేర్చుకుంటే అనేక రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు అని చెబుతారు. అందుకనే వారానికి కనీసం రెండుసార్లు ఏదోక రూపంలో మునగాకు తింటే శరీరానికి కాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఎముకలకు బలం చేకూరి దృఢంగా మారుతాయి. ఈ రోజున మునగాకు పచ్చడి తయారీ గురించి తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు:
- మునగాకు – ఒక కప్పు
- ఉప్పు- కావలసినంత
- నూనె – వేయించడానికి సరిపడా
- ఆవాలు- ఒక స్పూన్
- జీలకర్ర – ఒక స్పూన్
- కరివేపాకు- గుప్పెడు
- ఎండుమిర్చి – 10
- మెంతులు- ఒక చిన్న టీ స్పూన్
- వెల్లుల్లి- 8 రెమ్మలు
- ధనియాలు- రెండు స్పూన్లు
- చింత పండు – కొంచెం
- పచ్చిమిర్చి- 8
- ఇంగువ – కొంచెం
తయారీ విధానం: ముందుగా మునగాకుని శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో నీరు పోసుకుని ఉప్పు వేసి అందులో మునగాకు వేసి శుభ్రంగా కడగాలి. నీరు నుంచి బయటకు తీసిన మునగాకుని నీరు లేకుండా ఒక కాటన్ క్లాత్ మీద వేసుకోవాలి. తడి ఆరిన తర్వాత మునగాకును చిన్నగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి తగినంత నూనె వేసి.. మెంతులు వేసి కొంచెం వేయించి.. తర్వత ఆవాలు, జీలకర్ర, వేసుకుని వేయించి.. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇంతలో అదే పాన్ లో నూనె వేసి కట్ చేసిన మునగాకు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. అందులోనే చింత పండు వేసి మరికొంచెం సేపు వేయించాలి. ఇప్పుడు మిక్సి గిన్నెలో వేయించి చల్లార్చి పెట్టుకున్న దినుసులను వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మునగాకు , చింత పండు వేసి మిక్సి పట్టి చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు పచ్చడి ని పోపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి.. వేడెక్కిన తరువాత నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ వేసి వేయించాలి. ఇందులో మిక్సీ పట్టుకున్న మునగాకు పచ్చడిని వేసి.. మరో ఐదు నిముషాలు వేయించాలి. అంతే ఆరోగ్యాన్ని ఇచ్చే రుచికరమైన మునగాకు పచ్చడి రెడీ. అన్నం, ఇడ్లీ, దోసల్లో వేసుకుని తినవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








