Fish: కొంతమందికి మాంసాహారం అంటే చాలా ఇష్టం. ముక్క లేనిదే ముద్ద దిగదంటారు. రెడ్ మీట్, చికెన్, ఫిష్ ఇవన్నీ మాంసాహారం కిందకే వస్తాయి. అయితే జనాలు ఎక్కువగా ఈ మూడింటిని కొనుగోలు చేస్తారు. ఆదివారం వచ్చిందంటే చాలు మటన్, చికెన్, ఫిష్ మార్కెట్లు సందడిగా కనిపిస్తాయి. అయితే ఆరోగ్యరీత్యా ఈ మూడింటిలో ఏది బెటర్ అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మాంసాహారంలో రెడ్ మీట్, వైట్ మీట్ అని రెండు రకాలుగా పిలుస్తున్నారు. రెడ్ మీట్ అంటే బీఫ్, మటన్, పోర్క్ లాంటివి. వైట్ మీట్ అంటే చేపలు, కోడి, రొయ్యలు, పీతలు, పక్షల మాంసం. అయితే చికెన్‌లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మటన్‌లో ప్రొటీన్‌తో పాటు ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కొవ్వు తినకూడదు, కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకునేవాళ్లు.. మటన్‌కి బదులు చికెన్‌ను ఎంచుకుంటారు. అయితే కొలెస్ట్రాల్‌తో సంబంధం లేని వాళ్లు మాత్రం మటన్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ రెండూ ఆరోగ్యానికి అంత మంచివి కావనుకునే చేపలు, రొయ్యలు తింటారు.
అయితే ఇప్పటి వరకు కొలెస్ట్రాల్‌ను పెంచే మాంసాహారం.. రెడ్ మీట్ ఒక్కటే అనుకునే వాళ్లు. కానీ కొన్ని సర్వేలు ఇది తప్పని చెబుతున్నాయి. రెడ్ మీట్, వైట్ మీట్ రెండూ కార్డియోవాస్క్యులర్ జబ్బులకు కారణమవుతాయని తేల్చింది. కొలెస్ట్రాల్ మాత్రమే కాకుండా ఈ మాంసంలో కార్నిటైన్ అనే పదార్థం వల్ల గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలను మూసుకుపోతున్నాయని తెలిపింది. అందుకే గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. సీఫుడ్స్ తింటే మాత్రం ఇటువంటి సమస్యలు ఉండవని సూచించింది.
సీఫుడ్స్ ముఖ్యంగా సాల్మన్ చేపలు ఆరోగ్యానికి మరింత ఉత్తమని పరిశోధనలు సూచిస్తున్నాయి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. మంచి ఆరోగ్యాన్ని పొందడానికి వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినవచ్చు. చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువ.. నాణ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. దీంతోపాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు.