Ice Cream: చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే అవాక్కవడం పక్కా..

ఐస్ క్రీమ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. టైమ్‌తో సంబంధం లేకుండా చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టంగా తింటారు. చాలా మంది చలికాలంలో ఐస్ క్రీమ్ తింటుంటారు. అసలు చలికాలంలో ఐస్ క్రీం తింటే నిజంగా జలుబు చేస్తుందా? లేక ఇదంతా ఒక కట్టుకథేనా? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Ice Cream: చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే అవాక్కవడం పక్కా..
Eating Ice Cream In Winter

Updated on: Dec 25, 2025 | 9:27 PM

బయట చలి చంపేస్తున్నా.. ఐస్ క్రీం పార్లర్ల దగ్గర జనం తగ్గరు. కొందరికి ఐస్ క్రీం తినడానికి సీజన్‌తో సంబంధం ఉండదు. అయితే చలికాలంలో ఐస్ క్రీం తింటే జలుబు, దగ్గు వస్తుంది అని ఇంట్లో పెద్దలు హెచ్చరిస్తుంటారు. ఇంతకీ ఈ మాటలో నిజమెంత..? వింటర్‌లో చల్లని ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమా..? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

ఐస్ క్రీం తింటే నిజంగా జలుబు వస్తుందా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఐస్ క్రీం తినడం వల్ల నేరుగా జలుబు రాదు. జలుబు, ఫ్లూ వంటివి వైరస్‌లు లేదా బ్యాక్టీరియా వల్ల వస్తాయి కానీ, చల్లని ఉష్ణోగ్రత వల్ల కాదు. చల్లని ఆహారం కడుపులోకి వెళ్లిన వెంటనే, మన శరీరంలోని అంతర్గత వ్యవస్థ దానిని వేడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పడిపోదు. ఐస్ క్రీం ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని ఉల్లాసంగా ఉంచే ఆహారం. అందుకే చాలామంది చలిలో కూడా దీనిని ఇష్టపడతారు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

ఆరోగ్యంగా ఉన్నవారు ఐస్ క్రీం తింటే పెద్దగా ఇబ్బంది లేకపోయినా కొన్ని సమస్యలు ఉన్నవారు మాత్రం దూరంగా ఉండటం మంచిది..

ఇవి కూడా చదవండి

గొంతు సమస్యలు: ఇప్పటికే గొంతు నొప్పి లేదా ఇన్‌ఫెక్షన్ ఉన్నవారికి చల్లని ఐస్ క్రీం ఆ అసౌకర్యాన్ని మరింత పెంచుతుంది.

అస్తమా, దగ్గు ఉన్నవారు: శ్వాసకోశ సమస్యలు లేదా తరచుగా దగ్గు వచ్చే వారికి చల్లని, చక్కెర కలిగిన ఆహారాలు కఫం ఉత్పత్తిని పెంచే అవకాశం ఉంది.

తేమ లేకపోవడం: చలికాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఐస్ క్రీం తినడం వల్ల గొంతు లోపలి భాగం మరింత పొడిబారి, వైరల్ ఇన్‌ఫెక్షన్లకు దారితీయవచ్చు.

ఐస్ క్రీం తినేటప్పుడు పాటించాల్సిన చిట్కాలు

  • వారానికి ఒకటి లేదా రెండు సార్లు మించకుండా చూసుకోండి.
  • ఐస్ క్రీంను గబగబా తినకుండా, చిన్న స్పూన్లతో నిదానంగా తినండి. దీనివల్ల నోటి ఉష్ణోగ్రత అకస్మాత్తుగా తగ్గదు.
  • ఐస్ క్రీం తిన్న తర్వాత గ్లాసు గోరువెచ్చని నీరు లేదా పాలు తాగడం వల్ల గొంతు సాధారణ స్థితికి వస్తుంది.
  • మీకు కొంచెం జలుబుగా అనిపించినా ఆ సమయంలో ఐస్ క్రీంకు దూరంగా ఉండటమే ఉత్తమం.

మొత్తానికి చలికాలంలో ఆరోగ్యంగా ఉన్నవారు ఐస్ క్రీం తినడం సురక్షితమే. అయితే అది మితంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు.. పరిమితి దాటితే ఏదైనా ప్రమాదమే.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..