Personal Loan: రూ.10వేల జీతం ఉంటే పర్సనల్ లోన్ వస్తుందా.. రూల్స్ ఏంటీ..?
డబ్బు అవసరం ఎప్పుడు, ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి సమయంలో అందరికీ గుర్తొచ్చేది పర్సనల్ లోన్. అయితే, లక్షల్లో జీతం ఉన్నవారికే బ్యాంకులు లోన్లు ఇస్తాయని మీరు అనుకుంటున్నారా..? నెలకు కేవలం రూ. 10,000 సంపాదించే సామాన్యుడికి అసలు బ్యాంకులు లోన్ ఇస్తాయా..? ఒకవేళ ఇచ్చినా ఆ రూల్స్ ఏంటీ..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఆధునిక కాలంలో ఏ అవసరం వచ్చినా టక్కున గుర్తొచ్చేది లోన్. లోన్స్‌పై ఆధారపడేవారి సంఖ్య బాగా పెరిగింది. అయితే వ్యక్తిగత రుణం పొందాలంటే కచ్చితంగా ఎక్కువ జీతం ఉండాలని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా నెలకు రూ.10,000 మాత్రమే సంపాదించే వారికి బ్యాంకులు లోన్ ఇస్తాయా? అనే సందేహం ఉంటుంది. దీనిపై బ్యాంకుల నిబంధనలు, నిపుణులు చెబుతున్న ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం..
జీతం ఎంతుంటే లోన్ వస్తుంది?
పర్సనల్ లోన్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్.. అంటే బ్యాంకులు ఎటువంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తాయి. అందుకే అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు మీ ఆదాయాన్ని, క్రెడిట్ స్కోర్‌ను నిశితంగా పరిశీలిస్తాయి. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు కనీస జీతం విషయంలో కఠినంగా ఉంటాయి. ఉదాహరణకు.. ఎస్‌బీఐ ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం రూ. 20,000, ప్రైవేట్ ఉద్యోగులకు రూ. 25,000 జీతం ఉండాలని నిబంధన విధిస్తోంది. హెచ్‌డిఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు కూడా సాధారణంగా రూ.25,000 కంటే తక్కువ జీతం ఉన్నవారికి లోన్ ఇవ్వడానికి వెనుకాడుతుంటాయి.
రూ. 10,000 జీతం ఉన్నవారికి లోన్ వస్తుందా..?
అవును.. నెలకు రూ. 10,000 సంపాదిస్తున్నప్పటికీ రుణం పొందే అవకాశం ఉంది. అయితే దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి..
NBFCలు – ఫిన్‌టెక్ యాప్స్: బజాజ్ ఫిన్‌సర్వ్, మనీ వ్యూ, క్రెడిట్ బీ వంటి సంస్థలు తక్కువ జీతం ఉన్నవారికి కూడా రుణాలు అందిస్తాయి. కొన్ని సంస్థలు రూ.10,000 నుండి రూ.15,000 జీతం ఉన్నవారికి కూడా చిన్న మొత్తంలో రుణాలు ఇస్తాయి.
క్రెడిట్ స్కోర్: మీ జీతం తక్కువగా ఉన్నప్పుడు మీ క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే లోన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రుణ మొత్తం: జీతం రూ.10,000 ఉన్నప్పుడు బ్యాంకులు మీకు ఇచ్చే రుణ మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. మీ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఇది నిర్ణయించబం జరుగుతుంది.
అర్హతలు మెరుగుపరుచుకోవడం ఎలా?
తక్కువ ఖర్చులు: మీ జీతంలో ఎక్కువ భాగం ఆదా అవుతున్నట్లు బ్యాంకులు గుర్తిస్తే లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
కో-అప్లికెంట్: మీ జీతం తక్కువగా ఉన్నప్పుడు, మీ ఇంట్లో సంపాదిస్తున్న మరో వ్యక్తిని కో-అప్లికెంట్‌గా చేర్చుకుంటే లోన్ సులభంగా మంజూరవుతుంది.
మీ జీతం తక్కువగా ఉన్నప్పటికీ మంచి క్రెడిట్ రికార్డు ఉంటే చిన్న మొత్తంలో రుణం పొందవచ్చు. అయితే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అన్ని బ్యాంకులు, యాప్‌లను పోల్చి చూసుకున్న తర్వాతే లోన్ తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




