Ash Gourd Juice: రోజూ బూడిద గుమ్మడి కాయ జ్యూస్ తాగుతున్నారా..? ఓర్నాయనో ఇది తెలుసుకోండి
ఈ మధ్యకాలంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది ఉదయాన్నే పడిగడుపున దీనిని తాగుతున్నారు. అయితే.. బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పచ్చి కూరగాయల జ్యూస్‌లలో ఉండే ఆక్సిలేట్‌లు ఈ సమస్యకు కారణం కావచ్చు. యాంటీ-న్యూట్రియంట్లను తగ్గించడానికి ఉడకబెట్టి తాగడం ఉత్తమం..

బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈ మధ్యకాలంలో చాలా ట్రెండీగా మారింది. ఆరోగ్యం కోసం చాలామంది దీన్ని ఉదయాన్నే పడిగడుపున తాగుతున్నారు. అయితే, దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు, సురక్షితమైన వినియోగం గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యమంటున్నారు ఆయుర్వేద నిపుణులు.. అన్ని కూరగాయలలో యాంటీ-న్యూట్రియంట్స్ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఇవి శరీరంలో విటమిన్ శోషణ, జీర్ణక్రియను ప్రభావితం చేయవచ్చు. బూడిద గుమ్మడికాయలో ఆక్సిలేట్స్ అనే యాంటీ-న్యూట్రియంట్ అధికంగా ఉంటుంది. సుమారు 300-400 గ్రాముల బూడిద గుమ్మడికాయ ముక్కల నుండి తీసిన 200-300 ml పచ్చి జ్యూస్‌లో ఆక్సిలేట్ల సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ఆక్సిలేట్ కంటెంట్ మనం ఆహారం ద్వారా తీసుకునే కాల్షియంతో కలిసి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు. ఇది అందరికీ రాకపోయినా, కొంతమందిలో ఆరోగ్య సమస్యలను సృష్టించగలదు. అందుకే, పడిగడుపున పచ్చి జ్యూస్ తాగడం అనేది అందరికీ సరైనది కాదని హెచ్చరిస్తున్నారు.
సురక్షితమైన వినియోగ మార్గాలు:
ఆక్సిలేట్ కంటెంట్‌ను తగ్గించడానికి బూడిద గుమ్మడికాయను ఉడకబెట్టి లేదా కొద్దిగా వేగించి జ్యూస్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇలా చేయడం వల్ల దానిలోని యాంటీ-న్యూట్రియంట్ ప్రొఫైల్ తగ్గి, విటమిన్లు – ఖనిజాలు శరీరానికి మంచిగా అందుతాయి. పచ్చి కూరగాయల జ్యూస్‌లు దీర్ఘకాలంలో చెడు ప్రభావాలు చూపవచ్చని పేర్కొంటున్నారు..
డిటాక్స్ జ్యూస్‌ల వాస్తవాలు:
శరీరాన్ని డిటాక్స్ చేస్తుందని చెప్పి అనేక రకాల జ్యూస్‌లను ప్రచారం చేస్తున్నారు. అయితే, కిడ్నీలు, లివర్, లింఫాటిక్ సిస్టం, చర్మం వంటి మన శరీర అవయవాలు సహజంగానే శరీరాన్ని డిటాక్స్ చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డిటాక్స్ జ్యూస్‌లు అనేది ఒక స్కామ్ అని, శరీరానికి నిజంగా ఏదైనా సమస్య ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని, జ్యూస్‌లు తాగడం వల్ల లాభం లేదని సూచిస్తున్నారు.
సరైన జీవనశైలి, అంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం ద్వారా శరీరం దాని డిటాక్సిఫికేషన్ ప్రక్రియను సమర్థవంతంగా చూసుకుంటుందని గుర్తుచేస్తున్నారు. చాలా మంది జ్యూస్ తాగిన వెంటనే చురుకుగా ఉన్నట్లు భావిస్తారని, అది కేవలం శరీరానికి లభించే విటమిన్లు – ఖనిజాల తాత్కాలిక ప్రభావం మాత్రమేనని పేర్కొంటున్నారు..
పండ్లు, కూరగాయల జ్యూస్‌ల మధ్య వ్యత్యాసం:
పండ్ల జ్యూస్‌ల విషయంలో ఆక్సిలేట్ల సమస్య అంతగా ఉండదని, పండ్లు పండిన కొద్దీ వాటిలోని యాంటీ-న్యూట్రియంట్ ప్రొఫైల్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండు దీనికి ఒక ఉదాహరణ. అయితే, ఏదేమైనా పండ్ల జ్యూస్‌ల కంటే పండ్లను నేరుగా తినడం మరింత ప్రయోజనకరమని పేర్కొంటున్నారు.
ఇది కూడా ముఖ్యం..
క్యాలరీల లెక్కింపు చాలామందికి గందరగోళంగా ఉంటుందని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. క్యాలరీలు అనేది మనం తీసుకునే ఆహార శక్తిని కొలవడానికి ఒక కొలమానం మాత్రమే. క్యాలరీల గురించి లోతైన జ్ఞానం లేనివారు పోర్షన్ కంట్రోల్ ద్వారా కూడా తమ ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకోవచ్చు.. శరీరానికి ఎంత ఆహారం అవసరమో అర్థం చేసుకుని, తగిన మోతాదులో తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు.
బూడిద గుమ్మడి జ్యూస్ లేదా మరే ఇతర కూరగాయల జ్యూస్‌లను పచ్చిగా, ఖాళీ కడుపుతో తాగేటప్పుడు జాగ్రత్త వహించాలి. యాంటీ-న్యూట్రియంట్లను తగ్గించడానికి వాటిని ఉడకబెట్టి లేదా వండుకుని తీసుకోవడం మంచిది. ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా.. సందేహాలున్నా.. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ముఖ్యం..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
