Lifestyle: గంటలతరబడి కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారా.? మీ కళ్లను ఇలా రక్షించుకోండి
ప్రస్తుతం పని విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడమే పనిగా మారిపోయింది. వృత్తిరీత్తా కొందరు కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోతే మరికొందరు స్మార్ట్‌ఫోన్‌లకు అడిక్ట్ అవుతున్నారు...

ప్రస్తుతం పని విధానంలో పూర్తిగా మార్పు వచ్చింది. గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడమే పనిగా మారిపోయింది. వృత్తిరీత్తా కొందరు కంప్యూటర్ స్క్రీన్లకు అతుక్కుపోతే మరికొందరు స్మార్ట్‌ఫోన్‌లకు అడిక్ట్ అవుతున్నారు. దీంతో కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే కంప్యూటర్ల ముందుకు కూర్చొక తప్పని పరిస్థితి కొందరిది. మరి ఇలాంటి వారు కంటి సంబంధిత సమస్యల నుంచి ఎలా బయటపడాలి.? ఇందుకోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* కంటి సమస్యలను దరిచేరకుండా ఉండాలంటే. ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. అనంతరం వెన్నెముకను నిఠారుగా ఉంచాలి. రెండు కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉండడానికి లోతైన శ్వాసను తీసుకోవాలి. అనంతరం రెండు చేతులు బాగా రుద్దాలి. తర్వాత రెండు చేతులతో కళ్లకు నెమ్మదిగా అద్దాలి. ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి. దీనివల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.
* ఇక కళ్లకు బెస్ట్ వ్యాయామాల్లో బ్లింకింగ్ ఒకటి. సాధారణంగా కంప్యూటర్, ఫోన్ స్క్రీన్‌లను అదే పనిగా చూస్తుంటే కళ్లు డ్రై అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే కను రెప్పలను ఆడిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కంటిలో డ్రై నెస్ తగ్గిపోతుంది.
* కంటి ఆరోగ్యానికి కాపాడుకునేందుకు మరో ట్రిక్ అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా అస్సలు వెలుతురు రాని ఓ చీకటి గదిలో కూర్చోవాలి. అనంతరం ముందు ఒక క్యాండీల్‌ను వెలిగించాలి. క్యాండిల్‌ను కాసేపు అదే పనిగా చూడాలి. అనంతరం కళ్లను కాసేపు మూసుకోవాలి. కొన్ని సెకన్ల తర్వాత, మీ కళ్ళు తెరిచి, ప్రక్రియను పునరావృతం చేయండి. ఇలా 5-10 నిమిషాలు చేయాలి.
* కంటి వ్యాయామాల్లో మరొకటి కను గుడ్లను అటు ఇటు తిప్పడం. ఇందుకోసం ముందుగా ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చోవాలి. అనంతరం మీ కళ్లను వీలైనంత వరకు కుడివైపు తిప్పాలి, తర్వాత ఎడమ వైపునకు తిప్పాలి. ఇలా నెమ్మదిగా అటు ఇటు తిప్పడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.
* ఇక కంపూట్యర్‌ల ముందుకు ఎక్కువ సేపు కూర్చునే వారు అదే పనిగా స్క్రీన్‌వైపు చూడకూడదు. మధ్య మధ్యలో స్క్రీన్ పక్కకి తల తిప్పి దూరంగా ఉన్న వస్తువులను చూస్తుండాలి.
* అలాగే కంటి లోపల డ్రై కాకుండా చూసుకోవాలి. ఇందుకోసం ప్రతీ 2 గంటలకు ఒకసారైనా చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. కంటిలో నీటితో శుభ్రం చేసుకోవాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..
