
గత కొన్ని రోజులుగా గుడ్ల గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కొన్ని బ్రాండ్ల గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత యాంటీబయాటిక్ అవశేషాలు అధికంగా ఉన్నాయని, ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో FSSAI ఈ విషయంపై కీలక ప్రకటన వెలువరించింది. ఈ ప్రకటనలో ఏముందో, గుడ్లు తినడం వల్ల నిజంగా క్యాన్సర్ వస్తుందో లేదో ఇక్కడ తెలుసుకుందాం..
గుడ్లు ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాల నిధి. వాటిలో విటమిన్ ఎ, బి12, డి, ఇ, ఐరన్, జింక్, కోలిన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కండరాలను బలోపేతం చేస్తాయి. అవి మంచి కంటి చూపును కాపాడుతాయి. ఎముకలను బలోపేతం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే రోజుకు 1-2 గుడ్లు తినడం చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం, గుడ్లు పూర్తి ప్రోటీన్ మూలం. అవి కండరాలను నిర్మించడానికి, మెదడు ఆరోగ్యానికి, కళ్ళకు మంచివి. FSSAI నివేదిక గుడ్లపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసింది. ప్రతిరోజూ గుడ్లు తినడం వల్ల ఏ రకమైన క్యాన్సర్ రాదని స్పష్టం చేసింది. గుడ్లలో మెదడు, కాలేయానికి అవసరమైన కోలిన్ ఉంటుందని తెలిపింది. ఇది స్త్రీలు, పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాన్సర్ పుకార్ల కారణంగా భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.
దేశంలో విక్రయిస్తున్న గుడ్లు పూర్తిగా సురక్షితమైనవని FSSAI పేర్కొంది. గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదు. ఈ వాదనలు తప్పుదారి పట్టించేవి. వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. FSSAI ప్రకారం కోళ్ల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్ వాడకం పూర్తిగా నిషేధించబడింది. శాస్త్రీయ ఆధారాల ప్రకారం నైట్రోఫ్యూరాన్ తక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్ లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు. ఉడికించిన లేదా వేయించిన గడ్లు ఎలా తీసుకున్నా మంచిదే. అయితే వేయించిన గుడ్లను తక్కువగా తినాలి. ఎందుకంటే గుడ్లు వేయించడానికి నూనెను ఉపయోగిస్తారు. ఉడికించిన కూరగాయలతో కలిపిన గుడ్లను తినడం ఎల్లప్పుడూ శరీరానికి మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.