Kitchen Hacks: ఈ సింపుల్ టిప్స్ తో కిచెన్ చిమ్నీని క్లీన్ చేయండి..! మంచి రిజల్ట్ ఉంటుంది..!
కిచెన్‌లో చిమ్నీని శుభ్రం చేసే ముందు చిమ్నీ స్విచ్ ఆఫ్ చేశారా లేదా అనే విషయం తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అలాగే శుభ్రపరచే సమయంలో కంటి సంరక్షణ కూడా ఎంతో ముఖ్యం. కంట్లో ధూళి, క్రిములు, నలకలు పడకుండా ఉండేందుకు గాగుల్స్ ధరించాలి. ఇది కేవలం మీ భద్రతకే కాకుండా.. శుభ్రపరిచే ప్రక్రియను సులభతరం చేస్తుంది.

చిమ్నీ శుభ్రపరచే సమయంలో చేతికి గ్లోవ్స్ వేసుకోవడం మంచిది ఎందుకంటే కొన్నిసార్లు నూనె, గ్రీజ్ వంటివి చేతులకు అంటిపెట్టుకుని చికాకు కలిగించవచ్చు. చిమ్నీ భాగాలను శుభ్రం చేసేటప్పుడు సాఫ్ట్ క్లాత్ లేదా స్పాంజ్ ని ఉపయోగించాలి. సరిగ్గా శుభ్రం చేసిన తర్వాత అన్ని భాగాలను ఆరనిచ్చి మళ్లీ అమర్చుకోవాలి.
చిమ్నీని శుభ్రం చేసే ముందు అందులోని భాగాలను జాగ్రత్తగా వేరుచేయాలి. సాధారణంగా చిమ్నీలో ఫిల్టర్లు, గ్రిల్లు, ఇతర ఉపకరణాలు ఉంటాయి. ఇవి సరైన విధంగా శుభ్రం కావాలంటే ముందుగా విడదీయడం అవసరం. తయారీ సంస్థ సూచించిన విధంగా ప్రతి భాగాన్ని క్రమపద్ధతిలో వేరు చేయండి.
చిమ్నీలో ఎక్కువగా మురికి పేరుకునే భాగం ఫిల్టర్. దీనిలో నూనె, ధూళి అధికంగా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. ఫిల్టర్‌ను తీసి, వేడి నీటిలో సబ్బు లేదా డిటర్జెంట్ కలిపి అందులో 15-20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మృదువైన బ్రష్‌తో నూనె, మురికిని పూర్తిగా తొలగించాలి. చివరగా శుభ్రమైన నీటితో కడిగి, గాలిలో ఆరనివ్వాలి.
చిమ్నీలోని గ్రిల్లు, ఇతర లోహపు భాగాలను శుభ్రం చేయాలంటే వేడి నీటిలో ద్రవ సబ్బు కలిపి నానబెట్టాలి. స్పాంజ్ లేదా బ్రష్ సహాయంతో బాగా శుభ్రం చేయాలి. ఇలా చేస్తే భాగాలపై పేరుకున్న నూనె, ధూళి సులభంగా తొలగిపోతాయి. చివరగా శుభ్రమైన నీటితో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.
చిమ్నీ లోపల పొగ, ఆయిల్ గ్రీజ్ పేరుకుపోయే అవకాశం ఎక్కువ. దీన్ని తొలగించేందుకు తేలికపాటి డిటర్జెంట్, వేడి నీటిని ఉపయోగించాలి. సాఫ్ట్ క్లాత్ లేదా స్పాంజ్ తో లోపలి గోడలను తుడిచిపట్టాలి. మరీ మొండిగా ఉన్న మురికిని తొలగించడానికి బేకింగ్ సోడా నీటి మిశ్రమాన్ని రాసి కొంతసేపు వదిలి ఆపై తుడిచేయాలి.
ప్రతి భాగాన్ని పూర్తిగా ఆరనివ్వాలి. ఆపై విడదీసిన ఫిల్టర్, గ్రిల్లు, ఇతర భాగాలను చిమ్నీలో తిరిగి అమర్చాలి. సరిగ్గా అమర్చినట్లా అని నిర్ధారించుకోవాలి. అన్ని భాగాలను అమర్చిన తర్వాత చిమ్నీని మళ్లీ ఆన్ చేసి పనిచేస్తుందా లేదా అనేది పరీక్షించాలి. ఎక్కడైనా అవాంఛిత శబ్దం లేదా లోపం ఉంటే అవసరమైన మార్పులు చేయాలి. ఈ విధంగా చిమ్నీని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే ఎక్కువ రోజులు పని చేస్తుంది.