AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే ఇక అంతే..

ముఖంపై సూది పడిందో.. ఇక జైలు గదే దిక్కు. దేశవ్యాప్తంగా బ్యూటీ క్లినిక్‌ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ ఇది. చర్మ సౌందర్యం, స్కిన్ గ్లో, యాంటీ-ఏజింగ్.. ఈ పేర్లతో క్లినిక్‌లలో సాగుతున్న ఇంజెక్షన్ల దందాను కంప్లీట్‌గా బ్యాన్ చేసింది కేంద్రం. కాస్మెటిక్స్ అంటే కేవలం చర్మంపై రాసే 'పైపూత' మాత్రమేనని, వాటిని సిరంజిల్లో నింపి శరీరంలోకి ఎక్కిస్తే కటకటాల వెనక్కి నెట్టడం ఖాయమని తేల్చి చెప్పింది.

తెల్లగా మెరిసిపోవాలని ఆశపడుతున్నారా..? ముఖంపై సూది పడితే ఇక అంతే..
Beauty Injections
Shaik Madar Saheb
|

Updated on: May 21, 2026 | 8:40 PM

Share

తెల్లగా మెరిసిపోవాలని ఆశ.. వయసు దాచేయాలనే తహతహ. దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని బ్యూటీ క్లినిక్‌లు. కొన్ని కాదు చాలావరకు బ్యూటీ క్లినిక్‌లది అదే యావ. చర్మంపైనా, కంటి కింద, పొట్టపైనా.. ఇలా ఇంజెక్షన్ల మీద ఇంజక్షన్లు ఇస్తూ పోతారు. అందంపై ఆశతో వచ్చే వాళ్లు ఏమైపోయినా ఫర్వాలేదు గానీ.. వీళ్ల బిజినెస్ మాత్రం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగిపోవాలి. అలా ఎంతోమందిని మోసం చేస్తూ, ఎన్నో సందర్భాల్లో ప్రాణాలతోనూ చెలగాటం ఆడాయి ఈ అందం ముసుగులోని క్లినిక్‌లు.

కాస్మెటిక్స్ అంటే కేవలం చర్మం పైపైన రాసుకోవడానికి మాత్రమే! కానీ, నేటి కార్పొరేట్ బ్యూటీ క్లినిక్‌లు.. ఎక్కువ డబ్బుల కోసం కెమికల్స్‌ను సిరంజిల్లో నింపి, చర్మానికి, నరాల్లోకి ఎక్కిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఇచ్చేది గ్లుటాథియాన్. ఇదో పెద్ద దగా. తెల్లబడతారంటూ ఇచ్చే ఈ ఇంజెక్షన్లు శరీరంలో సహజంగా ఉండే రక్షణ వ్యవస్థను బూడిద చేస్తాయి. మెడికల్ లైసెన్స్ లేని బ్యూటీ పార్లర్ నిర్వాహకులు కూడా ఇష్టమొచ్చినట్టు సూదులు గుచ్చుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

కేంద్రం ఉన్నట్టుండి.. ఇంజెక్షన్ల ద్వారా బ్యూటీ ట్రీట్‌మెంట్లపై నిషేధం ఎందుకు విధించిందో యువతకు తెలియడం లేదు. చర్మంపై మెరుపు కోసం ఇచ్చే ఒక్క ఇంజెక్షన్.. శరీరంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చాలామందికి తెలీదు. రక్తంలో కలిసి వెళ్లే ఆ విషపూరిత రసాయనాలను వడపోయలేక కిడ్నీలు, లివర్లు కుళ్లిపోతాయి. చర్మాన్ని కాపాడే మెలనిన్‌ను బలవంతంగా చంపేయడం వల్ల, సూర్యరశ్మి తగలగానే చర్మం క్యాన్సర్ బారిన పడుతుంది. ముఖంపై తప్పుడు యాంగిల్లో ఇచ్చే బోటాక్స్, ఫిల్లర్స్ ఇంజెక్షన్ల వల్ల కంటి నరాలు దెబ్బతిని శాశ్వతంగా గుడ్డివాళ్లయిన రికార్డులు ఉన్నాయి. అందుకే, కాస్మెటిక్ ఉత్పత్తులను ఇంజెక్షన్లుగా వాడటం చట్టవిరుద్ధం అంటూ వార్నింగ్ ఇచ్చింది DCGI.

కేవలం ఇంజక్షన్లే కాదు.. ‘కలర్’ యాడ్స్‌పైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటామంటోంది. ‘నల్లగా ఉన్నారా, వారం రోజుల్లో తెల్లగా మార్చేస్తాం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రీల్స్ చేస్తూ అమాయకులను ఆకర్షించే బ్యూటీ క్లినిక్‌ల పని ఇక ఖతం. తప్పుడు క్లెయిమ్‌లతో ప్రకటనలు ఇస్తే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ కింద నాన్-బైలబుల్ వారెంట్ ఇష్యూ అవుతుంది. బెయిల్ కూడా దొరకకుండా జైల్లో చిప్పకూడు తినాల్సిందే! దీనిపై CDSCO నోటీసులు కూడా ఇష్యూ చేసింది.

తప్పుడు క్లెయిమ్‌లు చేసే ఎస్తెటిక్ క్లినిక్‌లపై ఇకపై ఉక్కుపాదం మోపబోతున్నారు. నిషేధిత పదార్థాలతో బ్యూటీ ట్రీట్‌మెంట్లు చేస్తే.. వెంటనే తమకు చెప్పాలని ప్రజలను కూడా అలర్ట్ చేస్తోంది CDSCO. ఇకపై బ్యూటీ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో తరుచూ తనిఖీలు చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us