Health: మంచిదని పిస్తా తింటున్నారా.? ఓసారి ఆలోచించుకోండి..
పిస్తా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో ఔషద గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే పిస్తాలు కొందరికి మాత్రం మంచివి కావని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు పిస్తాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రస్తుతం ఆరోగ్యంపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. వీటిలో పిస్తా కూడా ఒకటి. పిస్తాలో ఉండే ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిస్తాలో మెగ్నిషియం, కాపర్, జింక్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ6, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పిస్తా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పిస్తా.. కొందరిపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎలాంటి వారు పిస్తాకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు పిస్తాను మోతాదుకు మించి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. పిస్తా ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి ఎక్కువుతోంది. దీంతో చర్మంపై దద్దుర్లు, మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చర్మ సమస్యలు ఉన్న వారు కూడా పిస్తాను మితంగా తీసుకోవాలని అంటున్నారు.
* కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా.? అయితే పిస్తాకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో ఆక్సలేట్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతుందని అంటున్నారు. కిడ్నీల్లో రాళ్ల సమస్యలతో బాధపడేవారు పిస్తాకు వీలైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
* బరువు తగ్గాలనుకునే వారు కూడా పిస్తాకు దూరంగా ఉండాలని అంటున్నారు. పిస్తాలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు పిస్తాకు దూరంగా ఉండాలని అంటున్నారు.
* జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు పిస్తాకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కడుపుబ్బరం, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు పిస్తాకు దూరంగా ఉండాలి. వీటివల్ల ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.
* ఇక కొన్ని రకాల మందులను ఉపయోగించే వారు కూడా పిస్తాకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సమస్యల మెడిసిన్స్‌ను ఉపయోగించే వారు. పిస్తాకు దూరంగా ఉండాలి. ఇవి మందులతో చర్య జరిపి శరీరంపై సైడ్ ఎఫెక్ట్ కలిగించే ప్రమాదముంటుందని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..