AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric scooters: ఆమె పోరాటానికి దిగొచ్చిన ఓలా కంపెనీ..అసలు ఏమి జరిగిందంటే..?

దేశ మార్కెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. వివిధ ద్విచక్ర వాహనాల కంపెలతో పాటు కొత్త సంస్థలు కూడా ఈ విభాగంలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే కొన్నిసార్లు ఎలక్ట్రిక్ స్కూటర్ల వల్ల ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా స్టార్టింగ్ సమస్యలు, డిస్ ప్లే పనిచేయక పోవడం, అస్తమాను ఆగిపోవడం తదితర సమస్యలు ఏర్పడుతున్నాయి.

Electric scooters: ఆమె పోరాటానికి దిగొచ్చిన ఓలా కంపెనీ..అసలు ఏమి జరిగిందంటే..?
Ola
Nikhil
|

Updated on: Nov 02, 2024 | 4:00 PM

Share

ఎంతో ఉత్సాహంగా కొత్త స్కూటర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఇలాంటి సమస్య ఎదురైతే చాలా బాధగా ఉంటుంది. లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన వాహనాన్ని ఏం చేయాలో తెలియదు. సరిగ్గా ఇలాంటి సమస్యే బెంగళూరుకు చెందిన ఓ మహిళకు ఎదురైంది. ఆమె ధైర్యంగా ముందడుగు వేసి కంపెనీ నుంచి నష్టపరిహారం పొందింది. బెంగళూరుకు చెందిన ఆయేషా సిద్ధికా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేయాలని భావించింది. బెంగళూరు కల్యాణ్ నగర్ లోని ఓలా కు చెందిన సెంటర్ లో ఎస్ 1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేసింది. ఎంతో ఉత్సాహంగా స్కూటర్ పై ఇంటికి బయలుదేరింది. అయితే కొద్ది సేపటికే స్కూటర్ లోని ఇండికేటర్లు పనిచేయడం మానేశాయి. రన్నింగ్ లో హ్యాండిల్ ఆటోమేటిక్ లాక్ అవ్వసాగింది. సాఫ్ట్ వేర్ అప్ డేట్ కారణంగా ఈ సమస్యలు ఏర్పడినట్టు ఆమె తెలుసుకుంది.

కొత్త స్కూటర్ లో సమస్యల పరిష్కారానికి సర్వీస్ కేంద్రానికి వెళ్లింది. కానీ నెలలు గడుస్తున్నా అవి వదలడం లేదు. దీంతో విసుగు చెందిన ఆయేషా 2023 లో బెంగళూరు అర్బన్ 2 అదనపు జిల్లా వినియోగదారులు వివాదాల పరిష్కార కేంద్రాన్ని ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం చేయాలని కోరింది. ఓలా కంపెనీ వల్ల తనకు నష్టం కలిగిందని ఫిర్యాదు చేసింది. ఆయేషా తాను కొనుగోలు చేసిన స్కూటర్ ను తనిఖీ చేయాలని కస్తూరి నగర్ లోని ఆర్టీవోకు దరఖాస్తు చేసుకుంది. దీంతో సీనియర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఏటీ సురేష్ ఆ స్కూటర్ ను పరీక్షించారు.

అనంతరం స్కూటర్ లో సమస్యలు ఉన్నాయని, ఆయేషా చెప్పింది నిజమేనని నిర్ధారణ చేశారు. స్కూటర్ డిస్ ప్లేలో సమస్యలు ఉన్నాయని, హ్యాండిల్ తరచూ బిగుతుగా మారుతోందని వీటిని మరమ్మతులు చేయడం కష్టమన్నారు. పై సమస్యలతో పాటు వాహనం తరచుగా ఆగిపోతోందని నివేదిక అందించారు. ఆ నివేదికతో పాటు ఇతర సాక్షాలను బెంచ్ కు ఆయేషా సమర్పించింది. అలాగే ఓలా ఎలక్ట్రిక్ కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసును పరిగణనలోకి తీసుకుని వినియోగదారుల కోర్టు తీర్పు చెప్పింది. స్కూటర్ సక్రమంగా పనిచేయడం లేదని, సర్వీస్ లోపభూయిష్టంగా ఉందని నిర్ధారణ చేసింది. ఆయేషాకు రూ.1.54 లక్షలు చెల్లించాలని, మానసిక వేధింపులు, ఇతర వాటిని పరిహారంగా మరో రూ.30 వేలు అందజేయాలని, వ్యాజ్యం ఖర్చుల కోసం రూ.పది వేలు ఇవ్వాలని కంపెనీకి గత నెలలో ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి