
నేటి ఉరుకుల పరుగుల జీవితం, పెరిగిన ఒత్తిడి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల జుట్టు.. 30 ఏళ్లు దాటకముందే తలపైన అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు మెరుస్తుంటే చాలు.. వెంటనే ఆందోళన చెంది వాటిని పీకేస్తుంటాం. అలా పీకితే జుట్టు అంతా తెల్లగా అయిపోతుందని కొందరు, లేదు ఉన్నవి పీకేస్తే సమస్య పోతుందని మరికొందరు అనుకుంటారు. అసలు వాస్తవం ఏంటి? నిపుణులు ఏమంటున్నారు?
తెల్ల వెంట్రుకను పీకడం వల్ల తలలోని మిగతా జుట్టు కూడా తెల్లగా మారుతుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని నిపుణులు తేల్చి చెబుతున్నారు. జుట్టు రంగు అనేది మన శరీరంలోని మెలనిన్ అనే వర్ణద్రవ్యంపై ఆధారపడి ఉంటుంది. వంశపారంపర్యత, పోషకాహార లోపం, ఒత్తిడి వంటి కారణాల వల్ల మెలనిన్ ఉత్పత్తి తగ్గినప్పుడు వెంట్రుకలు తెల్లబడతాయి. ఒక తెల్ల వెంట్రుకను పీకితే ఆ రంధ్రం నుండి మళ్లీ తెల్ల వెంట్రుక వస్తుందే తప్ప, అది పక్కన ఉన్న వెంట్రుకలను తెల్లగా మార్చదు. తెల్ల వెంట్రుకలను పదే పదే పీకడం వల్ల తలలోని కుదుళ్లు దెబ్బతింటాయి. దీనివల్ల ఆ ప్రదేశంలో మళ్లీ జుట్టు మొలవకపోవడం లేదా జుట్టు పల్చబడటం వంటి సమస్యలు వస్తాయి.
బయట దొరికే కెమికల్ రంగుల కంటే ఇంట్లోనే సహజ పద్ధతుల్లో జుట్టు రంగును కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఉసిరిలో ఉండే విటమిన్-సి జుట్టును నల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరి పొడి, శికాకై పొడిని పెరుగు లేదా నీటితో కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు దృఢంగా, నల్లగా మారుతుంది.
బ్లాక్ టీలో ఉండే టానిక్ యాసిడ్ జుట్టుకు సహజమైన నలుపు రంగును ఇస్తుంది. రెండు స్పూన్ల టీ పొడిని నీటిలో మరిగించి చల్లార్చాలి. షాంపూ చేసిన తర్వాత ఈ నీటితో జుట్టును కడిగి, 15 నిమిషాల తర్వాత మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి.
హెన్నా జుట్టుకు మంచి రంగును ఇస్తే, కాఫీ ఆ రంగును మరింత డార్క్‌గా మారుస్తుంది. వేడి కాఫీ డికాషన్‌లో హెన్నా పొడిని కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు జుట్టుకు పట్టించి గంట తర్వాత కడిగేస్తే తెల్ల జుట్టు మాయమవుతుంది.
కేవలం ప్యాక్‌లు వేస్తేనే సరిపోదు, లోపలి నుండి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
తెల్ల జుట్టును చూసి భయపడి వాటిని పీకేయకండి. సహజ నివారణలను పాటిస్తూ, ధైర్యంగా మీ జుట్టును సంరక్షించుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి