Health Tips: నిద్రకు – పీరియడ్స్‌కు మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసా..? ఆసక్తికర విషయాలు
నిద్ర మీ పీరియడ్స్ పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని మీకు తెలుసా? ఇది మీ పీరియడ్స్ సక్రమంగా రాకుండా చేస్తుంది. మీరు 6 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే, మీ పీరియడ్స్ సర్కిల్ మారుతుంది. అలా జరగకుండా ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మహిళలను ప్రధానంగా వేధించేది పీరియడ్ ప్రాబ్లమ్స్. పీరియడ్ పెయిన్, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటి వాటితో వారు బాధపడుతుంటారు. ఋతుచక్రం సక్రమంగా రాకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. శరీరంలో అవసరమైన పోషకాల లోపం, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఋతుచక్రం సక్రమంగా రాకపోవడానికి కారణం కావచ్చు. కానీ చాలా మంది మహిళలకు దీని గురించి తెలియదు. ఈ చెడు అలవాట్లు, నిద్ర లేకపోవడం ఋతుచక్రాన్ని ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా పీరియడ్స్ ఆలస్యం కావడమే కాకుండా ఋతుచక్రంపై కూడా ప్రభావం చూపుతుంది. నిద్ర లేకపోవడం వల్ల ఋతుచక్రంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నిద్ర, హార్మోన్లు – రుతుచక్రం
ఋతుచక్రం సక్రమంగా ఉండటానికి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఈ హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరం ఒత్తిడికి గురై కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగి రుతుచక్రంపై నేరుగా ప్రభావం చూపుతుంది.
అనారోగ్యకరమైన నిద్ర అలవాట్లు
మీరు ప్రతిరోజూ 6 గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం నిద్రపోతే, అది మీ ఋతుచక్రాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రి ఆలస్యంగా మేల్కొని, ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడం వంటి చెడు అలవాట్లు కూడా ఋతుచక్రం సరిగ్గా రాకుండా చేస్తాయి. అలాగే, నిద్ర లేకపోవడం వల్ల జీవక్రియ, ఇన్సులిన్ నిరోధకతపై ప్రభావం పడి, ఊబకాయం పెరిగే అవకాశం ఉంది. ఈ కారణాలన్నీ కూడా రుతుచక్రం సక్రమంగా లేకపోవడానికి దారితీయవచ్చు.
నిద్ర లేకపోవడం వల్ల ఇతర ప్రభావాలు
నిద్ర లేకపోవడం ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. ఇది పునరుత్పత్తి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. సాధారణంగా రుతుచక్రం 21 నుంచి 35 రోజుల మధ్యలో రావాలి. దీనికంటే తక్కువ రోజుల్లో లేదా ఎక్కువ రోజుల్లో పీరియడ్స్ వస్తే దాన్ని క్రమరహిత రుతుచక్రంగా పరిగణించాలి. నిద్ర లేకపోవడంతో పాటు ఒత్తిడి, విటమిన్ D, విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాల లోపం కూడా రుతుచక్రంపై ప్రభావం చూపుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆరోగ్యకరమైన రుతుచక్రం కోసం మంచి నిద్ర, సరైన ఆహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవడం ఉత్తమం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




