What to keep in mind while using your phone: స్మార్ట్ ఫోన్ చేతిలోకొచ్చాక పడుకున్నా, నడుస్తున్నా, తింటున్నా.. ఏం చేస్తున్నా కళ్లు మాత్రం ఫోన్ స్క్రీన్‌పైనే ఉంటాయి. నేటి డిజిటల్ యుగంలో యువత చదువులు, ఉద్యోగాలు అన్ని ఎక్కువగా ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను చూస్తూ చేసేవి కావడం వినడానికి కొత్తేమీకాకపోయినా.. ఆరోగ్యం మాత్రం ప్రమాదం అంచున ఉందనే విషయం మర్చిపోకూడదు. వీటిని ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల నేటి కాలంలో వయసుతో సంబంధంలేకుండా అధిక శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎక్కువ సమయం డిజిటల్ స్క్రీన్‌లను చూస్తూ ఉంటే చూపు మందగించే ప్రమాదం ఉందనే విషయం కూడా కొత్తదేమీ కాదు. అలవాటు ప్రకారం ఇంటా, బయట ఎండలో ఉన్నప్పుడు కూడా ఫోన్ స్క్రీన్ చూస్తే కంటి చూపు పాక్షికంగా దెబ్బతినే ప్రమాదం ఉందని మీకు తెలుసా? ఎండలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల తాజాగా ఇద్దరు వ్యక్తులు చూపు కోల్పోయారు.
జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ ప్రచురించిన కథనాల ప్రకారం.. పగటిపూట ఎండలో తదేకంగా ఫోన్ చూడటం వల్ల ఓ 20 ఏళ్ల యువతి తన కంటి చూపు కోల్పోయినట్టు వెల్లడించింది. ఎండలో పోన్ చూడటం వల్ల సూర్య కిరణాలు ఫోన్ స్క్రీన్‌పై పడుతుంది. ఆ కాంతి కనుగుడ్డు రెటీనాకు తీవ్రమైన నష్టాన్ని కలిగించడం వల్ల కంటి చూపు కోల్పోయినట్లు తెల్పింది. ఇదే విధంగా మరో వ్యక్తి కూడా కంటి చూపు కోల్పోయినట్లు పేర్కొంది. ఈ స్థితిని వైద్ పరిభాషలో మాక్యూలోపతి లేదా మాక్యులార్ డీజెనరేషన్ అని కూడా పిలుస్తారు. ఇది మాక్యులా అనే రెటీనా వెనుక భాగాన్ని ప్రభావితం చేసే వ్యాధి. మాక్యులోపతికి గురైనవారు పూర్తిగా అంధులుగా మారరు. సూర్యరశ్మికి నేరుగా గురికావడం వల్ల రెటీనా, మాక్యులా దెబ్బతింటుంది. ఫలితంగా కంటి మధ్యలో బ్లైండ్ నెస్ ఏర్పడుతుంది. ఇటువంటి వారు దేనిని స్పష్టంగా చూడలేరు. దీనినే పర్మినెంట్ సెంట్రల్ స్కోటోమా అని కూడా అంటారు.
సోలార్ మాక్యులోపతి అంటే..
నిజానికి..సోలార్ మాక్యులోపతి సూర్యుని వైపు నేరుగా చూడటం వల్ల వస్తుంది. ఐతే తాజాగా చూపు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు సూర్యుడిని నేరుగా చూడకపోయినా.. ఫోన్, ట్యాబ్‌లను చూడటం వల్ల స్క్రీన్ మీద సూర్యకాంతి నేరుగా పడి అది వికిరణం చెంది కళ్ళని దెబ్బతీసింది. అందుకే బయట ఎండలో కూర్చున్నప్పుడు వీలైనంత వరకు ఫోన్ చూడకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ ఎండలో ఫోన్ వాడవల్సి వస్తే సన్ గ్లాసెస్ ఉపయోగించడం బెటర్. సూర్యుని నుంచి వెలువడే ప్రమాదకర యూవీఏ, యూవీబీ రేడియేషన్ ప్రభావం నేరుగా కంటిపై పడకుండా సన్ గ్లాసెస్ అడ్డుకుంటాయి.