గడ్డే కదా అని చిన్న చూపు చూసేరు.. పెద్ద వ్యాధులకు కూడా ముచ్చెమటలు పడతాయ్..
నిమ్మగడ్డి (లెమన్ గ్రాస్) కేవలం గడ్డి మొక్క కాదు.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాల నిధి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, జ్వరం, దగ్గు, జలుబు, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతూ, చర్మం, కురుల ఆరోగ్యానికి తోడ్పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి) ఆరోగ్య ప్రయోజనాల నిధిగా పేర్కొంటారు. దీనిలో ఔషధ గుణాలతోపాటు.. ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చాలామందికి నిమ్మగడ్డి గురించి తక్కువ అవగాహన ఉండవచ్చు.. కానీ ఇది కేవలం గడ్డి మొక్క మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందించే అద్భుతమైన మూలికగా పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు… నిమ్మగడ్డిని వంటకాలలో, పరిమళాల తయారీలో, సౌందర్య చికిత్సలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులో పోషకాలతో పాటు సువాసన వెదజల్లే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
నిమ్మగడ్డితో ఎన్నో సమస్యలు దూరం..
నిమ్మగడ్డిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, నొప్పి, మంట తగ్గుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి. ఇది జ్వరం, కడుపు సమస్యలు, పేగు పురుగులు, జలుబు, దగ్గు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అదనంగా, ఇది బరువు తగ్గడానికి, చర్మం, కురుల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నరాల బలహీనతను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, కీళ్ల నొప్పులను నివారించడానికి తోడ్పడుతుంది. పేలు, చుండ్రు, ఆర్థరైటిస్, స్ప్రేన్ వంటి సమస్యలకు కూడా నిమ్మగడ్డి మంచి పరిష్కారం. స్త్రీలలో నెలసరి నొప్పులను, వేళ్ల మధ్య పుళ్లను తగ్గిస్తుంది.
నిమ్మగడ్డిని ఎలా తీసుకోవాలి..
సులభంగా నిమ్మగడ్డి టీ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో నీరు మరిగించి, నిమ్మగడ్డి పోసలు వేసి ఐదు నిమిషాలు మరగనివ్వాలి. రుచి కోసం బెల్లం, మెంతి ఆకులు కలుపుకోవచ్చు. స్టవ్ ఆపి, గోరువెచ్చగా మారిన తర్వాత వడకట్టుకుంటే ఆరోగ్యకరమైన నిమ్మగడ్డి టీ సిద్ధమవుతుంది. దీని సువాసన ఒత్తిడిని తగ్గిస్తుందని, టీ తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతారు. అయితే.. లెమన్ గ్రాస్ జ్యూస్ గా కూడా తాగొచ్చు..
మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. నిమ్మగడ్డిని తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
