షుగర్ ఉన్నవారికి దాల్చినచెక్క మంచిదేనా? డాక్టర్ దీక్షా చెప్పిన వాడే విధానం ఇదే!
మధుమేహం నెమ్మదించిన మెటబాలిజం సమస్యలతో బాధపడేవారికి మన వంటింట్లో లభించే దాల్చినచెక్క ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్‌సార్ ప్రకారం.. దాల్చినచెక్కను సరైన పద్ధతిలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటమే కాకుండా జీర్ణశక్తి, మెటబాలిజం గణనీయంగా మెరుగుపడతాయి.

దాల్చినచెక్క రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, మెటబాలిజాన్ని పెంచడంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దీక్షా భావ్‌సార్ వెల్లడించారు. దాల్చినచెక్కలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే గుణాలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. అయితే దీనిని సరైన పద్ధతిలో తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
షుగర్ లెవెల్స్ ఎలా తగ్గుతాయి?
దాల్చినచెక్కలో ఉండే సహజసిద్ధమైన సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పనితీరును ప్రేరేపిస్తాయి. దీనివల్ల కణాలు గ్లూకోజ్‌ను వేగంగా గ్రహిస్తాయి. ఫలితంగా భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి.
మెటబాలిజం, బరువు నియంత్రణ
దాల్చినచెక్క శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది మందగించిన జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గడమే కాకుండా, శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు కరిగి బరువు తగ్గడం సులువవుతుంది.
ఎలా ఉపయోగించాలి?
దాల్చినచెక్కను నేరుగా ఎక్కువగా తీసుకోకూడదు. దీనిని చిన్న మోతాదులో మాత్రమే వాడాలి:
దాల్చినచెక్క నీరు/టీ: ఒక చిన్న దాల్చినచెక్క ముక్కను (లేదా పావు టీస్పూన్ పొడిని) ఒక గ్లాసు నీటిలో వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉదయాన్నే లేదా భోజనానికి అరగంట ముందు తాగాలి. మీరు రోజువారీగా తాగే హెర్బల్ టీ లేదా ఫ్రూట్ స్మూథీలలో చిటికెడు దాల్చినచెక్క పొడిని చల్లుకుని తీసుకోవచ్చు.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
దాల్చినచెక్క ఆరోగ్యానికి ఎంతో మంచిదైనప్పటికీ, కాలేయ సమస్యలు ఉన్నవారు లేదా తీవ్రమైన హైపోగ్లైసీమియా (చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉండటం) ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే దీనిని ఉపయోగించాలి. అలాగే రోజూ 1-2 గ్రాముల కంటే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో పాటు దాల్చినచెక్కను భాగం చేసుకోవడం వల్ల సహజ సిద్ధంగా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.




