Memory Tips: అమేజింగ్.. చదివింది మర్చిపోకుండా ఉండాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
చదివిన విషయాలను గుర్తుంచుకోవడానికి అనేక ఉపాయాలు అవసరం లేదని, కేవలం సరైన సమయంలో చేసే వ్యాయామం సరిపోతుందని పరిశోధనలు తేల్చాయి. ముఖ్యంగా, చదువు పూర్తయిన 3 నుండి 4 గంటల తర్వాత వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాయామం చేసినప్పుడు, మెదడులో BNDF అనే కీలక ప్రోటీన్ విడుదలవుతుంది.

చాలా మంది విద్యార్థులకు.. చదివిన పాఠాలు గుర్తుంచుకోవడం ఒక పెద్ద సవాల్. ఎంత కష్టపడి చదివినా, క్షణాల్లోనే మర్చిపోవడం తల్లిదండ్రులకు, పిల్లలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ కారణంగానే చాలా మంది తల్లిదండ్రులు తెల్లవారుజామున 4 గంటలకు పిల్లలను నిద్రలేపి చదివించడం వంటి ఒత్తిడితో కూడిన పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే చదివిన వాటిని గుర్తుంచుకోవడానికి ఇంత ఒత్తిడి అవసరం లేదని.. దానికి కేవలం వ్యాయామం సరిపోతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యాయామంతో జ్ఞాపకశక్తి బూస్ట్
నిపుణులు నిర్వహించిన పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. చదివిన వెంటనే కాకుండా చదివిన లేదా అధ్యయనం చేసిన నాలుగు గంటల తర్వాత శారీరక వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి నిలుపుదల గణనీయంగా మెరుగుపడుతుంది. ‘కరెంట్ బయాలజీ ఎ సెల్ ప్రెస్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం.. మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు, మెదడులో ఆ సమాచారం ఒక చిన్న గుర్తులాగా ఏర్పడుతుంది. ఈ గుర్తు బలపడటానికి కొన్ని గంటలు పడుతుంది. చదివిన వెంటనే వ్యాయామం చేస్తే అంత ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మెదడు అప్పుడు సమాచారాన్ని సరిచేసుకునే పనిలో ఉంటుంది. మనం చదివిన 3 లేదా 4 గంటల తర్వాత వ్యాయామం చేస్తే, అది మెదడుకు ఒక పవర్‌ఫుల్ బూస్టర్ లా పనిచేస్తుంది. వ్యాయామం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం మెదడుకు అందుతుంది. ఇది మెదడులోని అన్ని ముఖ్యమైన సమాచారాన్ని పక్కాగా ‘సేవ్’ చేయడానికి సహాయపడుతుంది.
BNDF అనే సూపర్ ప్రోటీన్
వ్యాయామం చేసినప్పుడు మన మెదడులో BNDF అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ విడుదల అవుతుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొత్త నరాలు పెరగడానికి, ఉన్న నరాలు బలంగా మారడానికి సహాయపడుతుంది. జ్ఞాపకాలను నిల్వ చేసే మెదడు భాగం బలంగా తయారవుతుంది.
గుర్తుంచుకోవలసిన చిట్కా
- చదువు లేదా ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకున్న తర్వాత…3 నుండి 4 గంటలు విరామం తీసుకోండి.
- తరువాత 20 నుండి 30 నిమిషాలు చురుకుగా నడవండి. జాగింగ్ చేయండి లేదా సైక్లింగ్ చేయండి.
- ఇలా చేయడం వల్ల శరీరం బలంగా అవ్వడంతో పాటు, చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




