షుగర్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. ఉదయాన్నే రెండు బిల్వ ఆకులు తిన్నారంటే శరీరానికి కలిగే లాభాలివే!
విశ్వరూపుడైన శివుడి పూజకు మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా బిల్వ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున 4 లేత విల్వ ఆకులను నమిలి తినడం వల్ల శరీరానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే తక్కువ రక్తపోటు ఉన్నవారు, గర్భిణీలు దీనికి దూరంగా ఉండటం మంచిది. పూర్తి ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో మారేడు ఆకులకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ప్రత్యేకించి శివ పూజలో వీటిని విధిగా ఉపయోగిస్తారు. అయితే, పూజలకే పరిమితం కాకుండా విల్వ ఆకులలో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడుపున నాలుగు లేత విల్వ ఆకులను నమిలి తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
బిల్వ ఆకులలోని పోషకాలు:
ఈ ఆకులలో విటమిన్ ఎ, బి6, బి12, సి, కాల్షియం రిబోఫ్లావిన్, పీచు పదార్థాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతో అవసరం.
ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు:
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ:
మధుమేహంతో బాధపడేవారికి విల్వ ఆకులు చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. పరగడుపున వీటిని నమిలి తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది డయాబెటిస్‌ను సహజంగా నియంత్రించడానికి సహాయపడుతుంది.
అల్సర్, జీర్ణ సమస్యల నివారణ:
విల్వ ఆకులకు శరీరాన్ని చల్లబరిచే మరియు పుండ్లను మాన్పే గుణాలు ఉన్నాయి. ఇవి కడుపులో, ప్రేగులలో ఏర్పడే అల్సర్‌లను తగ్గిస్తాయి. అలాగే అజీర్ణం, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేసి గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
శరీరంలోని వ్యర్థాల తొలగింపు:
శరీరంలోని లోపలి అవయవాలను శుభ్రపరిచే నేచురల్ డీటాక్స్ గుణాలు విల్వ ఆకులకు ఉన్నాయి. ఉదయాన్నే వీటిని నమలడం ద్వారా కాలేయం, కిడ్నీలలో పేరుకుపోయిన హానికరమైన వ్యర్థాలు బయటకుపోతాయి.
రోగనిరోధక శక్తి పెంపు:
ఇందులో ఉండే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కల్పిస్తాయి.
ఎవరు తినకూడదు?:
అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, లో బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు బిల్వ ఆకులను తినడానికి ముందు వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.




