AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఫుడ్.. గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టే కిచిడీ!

బరువు తగ్గాలనుకునే వారికి సజ్జ కిచిడీ మంచి ఆహార ఎంపిక. ఫైబర్, ప్రోటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండే సజ్జలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. కూరగాయలు, పెసరపప్పు, మసాలాలతో తయారుచేసే ఈ కిచిడీ రుచితో పాటు పోషకాలను అందిస్తుంది. ఇంట్లోనే సులభంగా తయారుచేసుకునే ఈ హెల్తీ రెసిపీ తయారీ విధానం, ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఫుడ్.. గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యలకు చెక్ పెట్టే కిచిడీ!
Sajja Millet Recipe
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2026 | 11:55 AM

Share

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా కీలకం. ఈ విషయంలో, పోషకాలతో నిండిన సజ్జ కిచిడీ (మిల్లెట్ కిచిడీ) ఒక గొప్ప ఎంపిక.. అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన సజ్జ మసాలా కిచిడీ కేవలం రుచికరంగా ఉండటమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సజ్జలు, లేదా బజ్రా, పోషకాల ఖజానా. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఉబ్బరం, గ్యాస్, పేగు సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. ఇంకా, బరువును నియంత్రించడంలో, బరువు తగ్గించ‌డంలో సహాయపడతాయి. సెలియాక్ వ్యాధి, గుండె జబ్బుల వంటి అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షణ కల్పిస్తాయని కూడా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ కిచిడీని అల్పాహారం, బ్రంచ్, భోజనం లేదా రాత్రి భోజనానికి ఎప్పుడైనా ఆస్వాదించవచ్చు.

సజ్జ కిచిడీ తయారీ విధానం చాలా సులభం, ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతోనే దీనిని చేసుకోవచ్చు. ముందుగా, ఒక కప్పు సజ్జలను మిక్సర్ జార్‌లో వేసి, పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేయాలి. గోధుమ నూక మాదిరిగా సజ్జలు 30-40 శాతం పగలాలి. ఇలా చేయడం వల్ల పై పొట్టు సులభంగా ఊడిపోతుంది. ఈ పొట్టును పళ్ళెంలో వేసి చెరిగితే తొలగిపోతుంది. ఆ తర్వాత, సజ్జలను నీటితో శుభ్రంగా కడిగి, పొట్టును పూర్తిగా తీసివేయాలి. శుభ్రం చేసిన సజ్జలను కనీసం మూడు నుండి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. పెసరపప్పును కూడా ఒక గంటసేపు నానబెట్టుకోవాలి.

తరువాత, ప్రెషర్ కుక్కర్‌లో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేడి చేసి, అర టీస్పూన్ వాము, పావు టీస్పూన్ ఇంగువ, ఒక టీస్పూన్ దంచిన మిరియాలు వేసి వేయించాలి. అనంతరం, నానబెట్టిన పెసరపప్పును వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తరువాత, నానబెట్టిన సజ్జలలోని నీటిని తీసివేసి, వాటిని కుక్కర్‌లో వేయాలి. సజ్జలలోని చెమ్మ ఆరిపోయేంతవరకు మీడియం ఫ్లేమ్‌లో వేపాలి. ఆ తర్వాత ఒక లీటరు నీరు పోసి, ఏడు నుండి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అప్పుడే సజ్జలు మెత్తగా ఉడికి, కిచిడీకి సరైన రుచిని అందిస్తాయి.

సజ్జలు ఉడికేలోపు, మరొక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి, అర టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, చిన్న బిర్యానీ ఆకు, అంగుళం దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, నాలుగు యాలకలు, రెండు ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత ఇంగువ వేసి పొంగించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి, ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు వేయించాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.

ఇప్పుడు, పావు కప్పు ఫ్రెంచ్ బీన్స్, అరకప్పు క్యారెట్ ముక్కలు, ముప్పావు కప్పు కాలిఫ్లవర్ ముక్కలు, పావు కప్పు ఫ్రోజన్ బఠాణీ, సన్నగా తరిగిన రెండు టమాటోలు వేసి వేపాలి. ఈ కిచిడీలో మీకిష్టమైన ఇతర కూరగాయలను కూడా ఉపయోగించవచ్చు, కనీసం నాలుగు నుండి ఐదు రకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. టమాటోలు కొద్దిగా మెత్తబడిన తర్వాత, ఒక టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్ వేపిన జీలకర్ర పొడి వేసి, అర కప్పు నీరు పోసి టమాటోలు పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించాలి. చివరగా, ఒక పెద్ద కప్పు పాలకూర తరుగు వేసి మగ్గనివ్వాలి. పాలకూర మగ్గిన తర్వాత, క్యారెట్లు పూర్తిగా మగ్గే వరకు మూతపెట్టి ఉడికించాలి.

క్యారెట్లు మెత్తబడిన తర్వాత, ముందుగా ఉడికించుకున్న సజ్జ ముద్దను ఈ మసాలా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ సజ్జలకు పట్టేలా చూసుకోవాలి. ఆ తర్వాత, సుమారు 600 మిల్లీలీటర్ల వేడి నీరు పోసి, మీడియం ఫ్లేమ్‌లో గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. వేడి నీరు పోయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. కిచిడీ చిక్కబడిన తర్వాత, దింపబోయే ముందు కాస్త కొత్తిమీర, అర టీస్పూన్ దంచిన మిరియాల పొడి, ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి దించేయాలి. సర్వ్ చేసే ముందు కొద్దిగా నెయ్యి వేసి, చల్లని రైతా, అప్పడాలు లేదా బూందీతో పాటు తింటే, ఈ సజ్జ మసాలా కిచిడీ రుచి అద్భుతంగా ఉంటుంది.

Follow Us