AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచిదేగానీ.. టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాల్లో టీ (తేనీరు) ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది ఉదయాన్నే ఒక కప్పు టీతో రోజును ప్రారంభిస్తారు. శరీరానికి ఉత్సాహాన్ని, మనసుకు చైతన్యాన్ని అందించే టీ ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అయితే టీ తయారుచేసే విధానం లేదా తాగే సమయంలో చేసే కొన్ని పొరపాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

మంచిదేగానీ.. టీ తాగేటప్పుడు ఈ పొరపాట్లు మీరూ చేస్తున్నారా?
Mistakes To Avoid While Drinking Tea
Srilakshmi C
|

Updated on: Jul 09, 2026 | 9:17 PM

Share

టీ అంటే చాలా మందికి అమితమైన ఇష్టం. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి టీ తాగితేనే రోజు ప్రారంభమైన భావన కలుగుతుంది. శరీరానికి, మనసుకు ఉత్సాహాన్ని అందించే ఈ పానీయం మన దైనందిన జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే టీ తయారీ లేదా టీ తాగే సమయంలో చేసే కొన్ని సాధారణ పొరపాట్లు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఖాళీ కడుపుతో టీ తాగడం మంచిది కాదు

చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇలా చేయడం వల్ల టీలోని ఆమ్ల పదార్థాలు కడుపు లోపలి పొరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. దీంతో గుండెల్లో మంట, అజీర్ణం, ఆకలి తగ్గడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే ఉదయం ముందుగా ఒక గ్లాసు నీరు లేదా జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీరు తాగి, అల్పాహారం తర్వాత టీ తీసుకోవడం మంచిది.

టీ పొడిని ఎక్కువసేపు మరిగించవద్దు

టీ రుచి బాగా రావాలనే ఉద్దేశంతో కొందరు టీ పొడిని ఎక్కువసేపు నీటిలో మరిగిస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ‘టానిన్’ అనే పదార్థం అధికంగా విడుదలై టీ చేదుగా మారుతుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. అలాగే టీని వడకట్టేందుకు చాలామంది ప్లాస్టిక్ జల్లెడలను ఉపయోగిస్తుంటారు. అయితే వేడి టీతో ప్లాస్టిక్‌లోని కొన్ని రసాయనాలు కలిసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఇవి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అందువల్ల ప్లాస్టిక్ జల్లెడల బదులుగా స్టీల్ జల్లెడలను ఉపయోగించడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

టీని మళ్లీ మళ్లీ వేడి చేయవద్దు

ఒకసారి తయారైన టీని పదేపదే వేడి చేసి తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల టీలోని రసాయనిక లక్షణాలు మారి ఆమ్లత్వం పెరగవచ్చు. దీంతో ఎసిడిటీ, కడుపు అసౌకర్యం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

భోజనం చేసిన వెంటనే టీ తాగడం ప్రమాదకరం

మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు చాలామందిలో కనిపిస్తుంది. టీలో ఉండే కెఫీన్, టానిన్లు ఆహారంలోని ఇనుము శోషణను తగ్గిస్తాయి. దీని వల్ల దీర్ఘకాలంలో రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాగే రాత్రి వేళల్లో టీ తాగడం వల్ల నిద్ర నాణ్యత కూడా దెబ్బతినవచ్చు.

టీ తయారీలో పాలు ఎప్పుడు కలపాలి?

చాలామంది ముందుగా పాలలోనే టీ తయారుచేస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ముందుగా నీటిలో టీ పొడిని మరిగించి, అవసరమైన ఇతర పదార్థాలు కలిపిన తర్వాత చివర్లో పాలు జోడించడం మంచిది. ఇలా చేయడం వల్ల టీలోని యాంటీఆక్సిడెంట్ల ప్రయోజనాలు మెరుగ్గా లభించే అవకాశం ఉంటుంది. టీ ఆరోగ్యానికి మేలు చేసే పానీయమే అయినప్పటికీ, దానిని సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు. చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా టీ రుచిని ఆస్వాదించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Follow Us