AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil: వంట నూనెలపై సర్కార్ సంచలన నిర్ణయం.. లూజ్ అమ్మకాలపై నిషేధం..!

మహారాష్ట్రలో లూజ్ వంట నూనె విక్రయాలపై FDA నిషేధం విధించింది. కల్తీ అరికట్టి, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం. ఇకపై ప్యాక్ చేసిన నూనె మాత్రమే విక్రయించాలి; మూలం, తయారీ, గడువు వివరాలు స్పష్టంగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని FDA హెచ్చరించింది. రెస్టారెంట్లు, హోటళ్లలో నూనె వాడకంపై పర్యవేక్షణ ఉంటుంది.

Cooking Oil: వంట నూనెలపై సర్కార్ సంచలన నిర్ణయం.. లూజ్ అమ్మకాలపై నిషేధం..!
Ban On Loose Edible Oil Sales In Maharashtra
Balaraju Goud
|

Updated on: Aug 20, 2026 | 6:18 PM

Share

వంట నూనె విక్రయాలపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కీలక నిర్ణయం తీసుకుంది. కల్తీ, నాణ్యత లేని నూనెల విక్రయాలను అరికట్టడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో లూజ్‌గా వంట నూనెను విక్రయించడంపై నిషేధం విధించింది. ఇకపై దుకాణదారులు బహిరంగంగా విడిగా వంట నూనెను విక్రయించకూడదని మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూనె ప్యాకెట్‌పై దాని మూలం, తయారీ, గడువు తేదీ వంటి వివరాలు స్పష్టంగా ఉండేలా చూడాలని FDA ఆదేశించింది.

లూజ్‌గా విక్రయించే నూనె ఎక్కడ తయారైంది? ఎప్పుడు తయారైంది? దాని గడువు ఎంత? అనే వివరాలను తెలుసుకోవడం కష్టమవుతోందని FDA పేర్కొంది. ఫుడ్ పాయిజనింగ్ వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు నూనె మూలాన్ని గుర్తించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం కూడా కష్టంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ట్రేసబిలిటీ ఉండేలా ప్యాక్ చేసిన నూనె విక్రయాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

మహారాష్ట్ర FDA కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సురక్షిత ఆహారం, సురక్షిత మహారాష్ట్ర’ కార్యక్రమంలో తదుపరి ప్రధాన దృష్టి వంట నూనెపై ఉంటుందని తెలిపారు. నూనె తయారీ నుంచి ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్ విక్రయాల వరకు ప్రతి దశలో నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వంట నూనెను పదేపదే వేడి చేసి ఉపయోగించడం కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని కమిషనర్ హెచ్చరించారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్‌లలో నూనెను పదేపదే ఉపయోగించే విధానాలపై FDA ప్రత్యేకంగా దృష్టి పెట్టనుంది.

అలాగే వంట నూనె ప్యాకేజింగ్‌కు ఉపయోగించిన టిన్‌లను నిబంధనలకు విరుద్ధంగా తిరిగి వినియోగించడంపై కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తయారీదారులు, పంపిణీదారులు, వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత లైసెన్సులు, FSSAI నిబంధనలు పాటించాలని FDA స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తుకారాం ముండే హెచ్చరించారు. ఈ నిర్ణయంతో మహారాష్ట్రలో వంట నూనె విక్రయాలు, వినియోగంపై పర్యవేక్షణ మరింత కఠినతరం కానుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us