Moral Story: ‘బావి మాత్రమే నీది.. నీళ్లు నావి..’ మోసానికి తగిన గుణపాఠం
The Well and the Water Dispute Story: తెలివిగా మోసం చేయాలని చేసే ప్రయత్నాలు చివరకు మనకే నష్టాన్ని కలిగిస్తాయి. న్యాయం, తర్కం ముందు కుయుక్తులు నిలవవు. నిజాయితీతో వ్యవహరించడం, ఇతరుల హక్కులను గౌరవించడం జీవితంలో విజయానికి, గౌరవానికి మార్గం. ఇక్కడ ఇచ్చిన రాము-గొపీ బావి వివాదం కథ ఈ విషయాన్ని భలే చమత్కారంగా తెలుసుకోవచ్చు..

రాము గోపి దగ్గర ఒక బావిని కొనుగోలు చేశాడు. కొనుగోలు పూర్తయిన తర్వాత రాము బావిలోని నీటిని వాడుకోవడానికి వెళ్లగా, గోపి అడ్డుకుని.. ‘నేను నీకు బావిని మాత్రమే అమ్మాను. బావిలో ఉన్న నీటిని అమ్మలేదు. నీళ్లు వాడుకోవాలంటే నాకు డబ్బులు చెల్లించాలి’ అని చెప్పాడు. దీంతో ఈ వింత వివాదం గ్రామ పెద్దల ముందుకు వెళ్లింది. అప్పుడు న్యాయమూర్తి గోపిని పిలిచి.. ‘నువ్వు బావిని అమ్మినట్టు ఒప్పుకుంటున్నావా?’ అని అడిగాడు. అందుకు గోపి.. అవును, బావిని అమ్మాను. కానీ నీటిని అమ్మలేదు అని సమాధానం చెప్పాడు.
గోపి ఉద్దేశ్యం అర్ధం చేసుకున్న న్యాయమూర్తి తెలివిగా ఇలా సమాధానం చెప్పాడు.. ‘బావి ఇప్పుడు రాముదే. నీళ్ల మాత్రం నీవని నువ్వు అంటున్నావు. అంటే రాము యాజమాన్యంలో ఉన్న బావిలో నీ నీటిని నిల్వ ఉంచుకున్నట్లే. మరి రాము అనుమతి లేకుండా అతని బావిలో నీటిని ఎందుకు ఉంచావు?’ అని అడగడంతో గోపి నాలుక కరచుకుంటాడు. గోపికి రెండు అవకాశాలు ఇస్తాడు.. నీళ్లు నీవే అయితే, వెంటనే బావి నుంచి నీటిని తీసుకెళ్లాలి. అలా చేయలేకపోతే, రాము బావిలో నీటిని నిల్వ ఉంచినందుకు అద్దె చెల్లించాలి అని చెప్పడంతో గోపి తన తప్పును అంగీకరిస్తాడు. వాస్తవానికి బావిలోని నీటిని వేరుగా తీసుకెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి గోపి తన వాదనను ఉపసంహరించుకోవాల్సి వస్తుంది.
రాము బావిని కొనుగోలు చేసినందున, బావిలోని నీటిని ఉపయోగించే హక్కు కూడా రాముకే ఉంటుంది. గోపి అదనంగా డబ్బులు అడగలేడు. లేదంటే తన నీటిని బావి నుంచి తీసివేయాలి లేదా బావిని ఉపయోగించినందుకు రాముకు అద్దె చెల్లించాలి అని న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో ఈ వివాదం ముగుస్తుంది.
నీతి
తెలివిగా ఇతరులను మోసం చేయాలని ప్రయత్నిస్తే, అదే వాదన మనకే వ్యతిరేకంగా మారవచ్చు. ఆస్తిని అమ్మినప్పుడు దానికి సహజంగా సంబంధించిన ఉపయోగ హక్కులు కూడా కొనుగోలుదారుకే చెందుతాయి. న్యాయం, తర్కం ముందు కుయుక్తులు నిలవవు.
