AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేబీఆర్ పార్కు చెట్ల నరికివేత కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ

హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఎకో సెన్సిటివ్‌ జోన్‌లో చెట్లను నరకరాదంటూ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలను పొడిగించింది. 25 నుంచి 35 మీటర్ల పరిధిలో చెట్ల తొలగింపుపై నిషేధం కొనసాగనుంది. SRDP పనులకు సంబంధించిన పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబర్‌ 3కి వాయిదా వేసింది.

కేబీఆర్ పార్కు చెట్ల నరికివేత కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
Kbr Park
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 6:55 PM

Share

హైదరాబాద్‌లో కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎకో సెన్సిటివ్ జోన్ (ESZ) పరిధిలో చెట్లను నరకవద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పొడిగించింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 25 నుండి 35 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను తొలగించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రభుత్వం, అధికారుల నుంచి తదుపరి సూచనలు, సమాచారం అందాల్సి ఉన్నందున కేసును వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది.

కేసు నేపథ్యం – ఎస్సార్డీపీ ప్రాజెక్టుల వివాదం

తెలంగాణ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణ కోసం వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం (SRDP) పనులను చేపట్టింది. అయితే ఈ ప్రాజెక్టుల కోసం పార్క్ చుట్టూ ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని 25-35 మీటర్ల నుండి 3-29.8 మీటర్లకు తగ్గించడాన్ని సవాలు చేస్తూ పర్యావరణ ప్రేమికురాలు కాజల్ మహేశ్వరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎకో సెన్సిటివ్ జోన్‌ను కుదించే క్రమంలో ఎలాంటి పబ్లిక్ హియరింగ్ నిర్వహించలేదని, 19,000 మందికి పైగా ప్రజలు వ్యతిరేకిస్తూ సంతకాలు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.

సుప్రీంకోర్టు గత విచారణ సందర్భంగా, పట్టణ ప్రాంతంలో ఈ ఎకో సెన్సిటివ్ జోన్ రక్షణ కవచంలా పనిచేయాలని, దానిని కుదించడం పర్యావరణ సమతుల్యతకు విఘాతమని పేర్కొంది. తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం పనులపై మధ్యంతర స్టే విధించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని ఎస్సార్డీపీ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి తదుపరి వివరణలు వచ్చిన తరువాత ఈ కేసులో పూర్తి విచారణ కొనసాగనుంది.

Follow Us