పిల్లలకే కాదు పేరెంట్స్ కూ పరీక్షా కాలమే.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
రానున్నది పరీక్షల కాలం.. ఇది పిల్లలతో పాటు పేరెంట్స్ కు కూడా పెద్ద సవాలే. ఎందుకంటే పెరిగిపోతున్న పోటీ తత్వం, గుదిబండలాంటి సిలబస్ పిల్లల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో పిల్లలు ఒత్తిడిని అధిగమించి పరీక్షలకు సన్నద్ధం కావడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం. ఈ సమయంలో తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి...

ఎమోషనల్ సపోర్ట్..
పిల్లలను ఈ సమయంలో అనేక భయాలు వెంటాడుతుంటాయి. ఇవి స్ట్రెస్, యాంగ్జైటీని కలుగజేస్తాయి. మంచి మార్కులు రాకపోతే తమ సామర్థ్యాలను జడ్జ్ చేస్తారని ఆందోళన పడుతుంటారు. వారితో తల్లిదండ్రులు నిరంతరం మాట్లాడుతూ ఉండాలి. ఫలితం ఏదైనా తామున్నామనే భరోసా వారిలో కల్పించాలి. వారితో వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయించాలి.
ఈ విషయాల్లో శ్రద్ధ చూపాలి..
కొందరు విద్యార్థులు పరీక్షలు సమీపించే వరకు సిలబస్ పూర్తిచేయలేరు. ఆ తర్వాత సమయం సరిపోక ఇబ్బంది పడతారు. పేరెంట్స్ ఈ విషయాలను ఓ కంటకనిపెడుతుండాలి. ముందు నుంచే వారిపై భారం లేకుండా ప్రిపరేషన్ కు సిద్ధం చేయాలి. టైం మేనేజిమెంట్ స్కిల్స్ తో పాటు చదువుకునే సమయాన్ని బ్యాలెన్స్ చేసుకునే టెక్నిక్స్ ను నేర్పాలి.
టైం కేటాయించుకోవాలి..
తల్లిదండ్రులు పిల్లల పరీక్షల కాలంలో వారి వారి పనుల్లో నిమగ్నమైపోకుండా కొంత సమయాన్ని ప్రత్యేకంగా పిల్లలకోసం కేటాయించాలి. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. వారికి అవసరమైన సాయం అందిస్తూ వెన్ను తట్టి ప్రోత్సహించాలి. అంతేకానీ, చదవలేకపోతే చిరాకు పడటం వంటివి చేయకూడదు. ఓపికగా చెప్పగలగాలి.
జీవిత పాఠాలనే స్పూర్తిగా..
తమ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తామెలో స్పందిచామో పిల్లలకు చెప్పాలి. వారి సొంత అనుభవాలను చెప్తూ స్పూర్తి నింపాలి. మంచి అలవాట్లను ప్రోత్సహించాలి. ఒక్క పరీక్షల సమయంలోనే కాదు. జీవితాంతం ఇవి వారి ఎదుగుదలకు పునాదిగా ఉపయోగపడతాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా..
పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటోందనే విషయాన్ని పేరెంట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. వారు ఏదైనా విషయాన్ని తమతో పంచుకోవడానికి సందేహిస్తున్నారా అని తెలుసుకోవాలి. ఎలాంటి సమస్యనైనా తమకు చెపితే పరిష్కారం దొరుకుతుందనే నమ్మకాన్ని ముందుగా వారిలో కల్పించాలి. ఇవి చేయగలిగితే పిల్లలు తరగతి పాఠాల్లోనే కాదు.. జీవితమనే పాఠాలను కూడా ఎంతో తేలికగా నేర్చుకోగలరు. తమకు ఎదురయ్యే అవాంతరాలను సునాయాసంగా ఎదుర్కోగలరు.