Longevity Secrets: 40 ఏళ్ల డాక్టర్.. 20 ఏళ్ల కుర్రాడిలా.. ఆ 3 సప్లిమెంట్లతో 17 ఏళ్లు ఏజ్ రివర్స్
సాధారణంగా 41 ఏళ్లు వచ్చేసరికి చాలామంది మధ్య వయస్సు అలసటకు గురవుతుంటారు. కానీ లండన్‌లోని 'హెచ్‌యూఎం2ఎన్' లాంజెవిటీ క్లినిక్ వ్యవస్థాపకుడు డాక్టర్ మహమ్మద్ ఎనాయత్ ఈ అంచనాలను తారుమారు చేశారు. అతడి జీవసంబంధ వయసు కేవలం 24 ఏళ్లు మాత్రమేనని ఆయన అంటున్నారు. అంటే, ఆయన పాస్‌పోర్ట్ ప్రకారం ఉన్న వయసు కంటే 17 ఏళ్లు చిన్నవాడని అర్థం. అతడి ఈ వయసును తగ్గించుకున్న రహస్యం, రోజువారీ ఆరోగ్య పర్యవేక్షణ, వ్యక్తిగత జీవనశైలి మార్పులు, ముఖ్యంగా మూడు కీలక సప్లిమెంట్ల గురించి అసలు రహస్యం బయటపెట్టాడు.

డాక్టర్ ఎనాయత్ ఏడేళ్లుగా తన శరీరాన్ని ఒక ప్రయోగశాలలా భావించారు. తన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ఆయన అత్యాధునిక సాంకేతిక పరికరాలను వినియోగించారు. అంతేకాదు, రక్తం, మూత్రం, మైక్రోబయోమ్ (సూక్ష్మజీవుల విశ్లేషణ) వంటి పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకున్నారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా, తన జీవనశైలిని, ఆహారపు అలవాట్లను, సప్లిమెంట్ల వినియోగాన్ని మార్చుకుంటూ వచ్చారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమబద్ధమైన వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడిని నియంత్రించడం వంటి జీవనశైలి మార్పులు బయోలాజికల్ ఏజ్‌ను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని డాక్టర్ ఎనాయత్ అనుభవం స్పష్టం చేస్తుంది. తన బయో ఏజ్‌ను తగ్గించుకోవడానికి మూడు కీలక సప్లిమెంట్లను తన దినచర్యలో భాగం చేసుకున్నారు…
విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలేట్:
డాక్టర్ ఎనాయత్‌కు మిథైలేషన్ జన్యు లోపం ఉంది. దీనివల్ల శరీరంలో హోమోసిస్టీన్ అనే రసాయన స్థాయిలు పెరుగుతాయి, ఇది గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ స్థాయిలను నియంత్రించడానికి ఆయన విటమిన్ బి కాంప్లెక్స్ ఫోలేట్ సప్లిమెంట్లను ఎంచుకున్నారు. ఈ సప్లిమెంట్లు హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని ఆయన తెలిపారు. సాధారణంగా, పోషకాలను ఆహారం నుంచే పొందాలని నిపుణులు సూచిస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో, లోపాలను సరిదిద్దుకోవడానికి లేదా ప్రత్యేక అవసరాల కోసం సప్లిమెంట్లు అవసరం కావచ్చు. విటమిన్ బి అధికంగా ఉండే చేపలు, పౌల్ట్రీ, చిక్కుళ్ళు ఆకుకూరలు వంటివి కూడా హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించగలవు. మానసిక స్థితిని మెరుగుపరచడంలో అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడంలో బి విటమిన్ల పాత్రపై మరింత పరిశోధన జరుగుతోంది.
మెగ్నీషియం:
ఆహారంలో సహజంగానే మెగ్నీషియం పుష్కలంగా లభించినప్పటికీ, డాక్టర్ ఎనాయత్ శరీరంలో ఈ ఖనిజం లోపం ఉందని గుర్తించారు. అందుకే, శరీరం సులభంగా గ్రహించుకునే మెగ్నీషియం బిస్గ్లైసినేట్ సప్లిమెంట్‌ను ఆయన ఎంచుకున్నారు. ఎముకల ఆరోగ్యం, రక్తంలో చక్కెర నియంత్రణ, కండరాల పనితీరుకు మెగ్నీషియం అత్యవసరం. దీనిని తీసుకోవడం వల్ల తన కండరాల నొప్పులు తగ్గాయని, నిద్ర కూడా మెరుగుపడిందని డాక్టర్ ఎనాయత్ పేర్కొన్నారు. చిక్కుళ్ళు, ఆకుకూరలు వంటివి మెగ్నీషియానికి మంచి వనరులు.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు:
గుండె ఆరోగ్యానికి, రక్తపోటు నియంత్రణకు పేరుగాంచిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ డాక్టర్ ఎనాయత్ రోజువారీ ఆహారంలో భాగమయ్యాయి. కొవ్వు శాతం ఎక్కువుండే చేపలు, వాల్‌నట్‌లు, చియా విత్తనాలలో ఇవి సహజంగా లభిస్తాయి. వారానికి కనీసం ఒక్కసారైనా కొవ్వుతో కూడిన చేపలు తినడం గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుందని నిరూపించబడింది. సప్లిమెంట్ల రూపంలో ఒమేగా-3ల ప్రయోజనాలపై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవలి అధ్యయనాలు, ఒమేగా-3లు తీసుకున్నవారికి బయోలాజికల్ ఏజ్ తక్కువగా ఉన్నట్లు సూచిస్తున్నాయి.